కరోనా కేసులు రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతుండడంతో ఏపీకి బీపీ పెరుగుతోంది. తాజాగా 4,348 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇద్దరు మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 47,884 నమూనాలు పరీక్షించగా సుమారు 10శాతం మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,204 యాక్టీవ్ కేసులున్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా జనవరి 1న 0.57%గా ఉన్న పాజిటివిటీ రేటు… 12 రోజుల్లో దాదాపు 10 శాతానికి పెరగడం కరోనా థర్డ్ వేవ్‌ను స్పష్టంగా చూపుతోంది. ముఖ్యంగా విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 932, విశాఖ జిల్లాలో 823 కేసులు నమోదు కావడం గమనార్హం.
గత మంగళవారం 1,831 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా 3,205కు కేసులు పెరిగాయి. థర్డ్ వేవ్ పంజా విసురుతుందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేసులు పెరుగుతున్నా ప్రజానీకం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
కానీ థర్డ్ వేవ్‌లో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో దూసుకొస్తోందని, ఇది ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరిస్తోంది. కావున ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కదలకపోవడమే ఉత్తమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ మరింత తీవ్రరూపం చెందుతుందనే హెచ్చరికలు నిజమయ్యేలా….ప్రస్తుతం నమోదవుతున్న కేసులున్నాయి.