భారీ వసూళ్లతో ప్రారంభమైంది 2020 టాలీవుడ్. ఇప్పటివరకు ఏ సంక్రాంతికి చూడనంత బిజినెస్ జరిగింది. అంతేస్థాయిలో రెవెన్యూ కూడా జనరేట్ అయింది. అలా 2020 సంక్రాంతి టాలీవుడ్ కు చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. కానీ జనవరి నెల బాక్సాఫీస్ కు మంచి ఓపెనింగ్ మాత్రం దొరకలేదు. మొదటివారం పోలోమంటూ డజను సినిమాలొచ్చినా ఒక్కటి కూడా మెరవలేదు.
జనవరి మొదటి వారం ఏకంగా 12 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో బ్యూటిఫుల్, తూట, అతడే శ్రీమన్నారాయణ, ఉల్లాలఉల్లాల లాంటి సినిమాలున్నాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాపులుగా నిలిచాయి. రంగీలాకు నీరాజనం అంటూ వచ్చిన వర్మ బ్యూటిఫుల్ సినిమా, రంగీలా పరువు తీసేలా ఉంది. ఇక ధనుష్-గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన తూటా సినిమా తమిళ్ లో ఫ్లాప్ అయినట్టే ఇక్కడ కూడా ఫ్లాప్ అయింది. నటుడు సత్యప్రకాష్ దర్శకుడిగా మారి తీసిన ఉల్లాల ఉల్లాల సినిమా.. రొమాంటిక్ పేరిట అడల్ట్ కంటెంట్ చూపించింది.
ఇక పాన్-ఇండియా అప్పీల్ తో వచ్చిన అతడే శ్రీమన్నారాయణ మూవీపై కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ టైపులో ఆశ్చర్యపరుస్తుందనుకున్నారు. కానీ శ్రీమన్నారాయణ నిరాశపరిచాడు. ఈ సినిమాలు రిలీజైన 48 గంటల గ్యాప్ లో మరో అరడజను సినిమాలు దండయాత్ర చేశాయి. ఇవి కూడా వేటికవే ఫ్లాపుల్లో ఆణిముత్యాలుగా నిలిచాయి. బూమరాంగ్, హల్ చల్, వైఫ్ ఐ, నమస్తే నేస్తమా, సమరం, ఉత్తర సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.
జనవరి 9 నుంచి సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఆ రోజున రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీ థియేటర్లకు వచ్చింది. సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో తెలుగులో ఆడనప్పటికీ రీసెంట్ గా రజనీకాంత్ నుంచి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్. అలా పాస్ మార్కులతో ఈ సినిమా గట్టెక్కింది. ఇక అసలైన సంక్రాంతి సందడి, జనవరి 11 నుంచి మొదలైంది. ఆరోజున మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైంది.
మహేష్-అనీల్ రావిపూడి కాంబినేష్ లో సంక్రాంతి మొగుడు అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా మహేష్ అభిమానులు ఆశించినట్టుంది తప్ప, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు లేదు. అనీల్ రావిపూడి రాసుకున్న కామెడీ ట్రాక్స్ ఈసారి పెద్దగా పేలలేదు. చివరికి ఎక్స్ ట్రా ఫన్ అంటూ జోడించిన కామెడీ సీన్ కూడా తేలిపోయింది. అయితే కంటెంట్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్ వల్ల వసూళ్లు మాత్రం భారీగా వచ్చాయి. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకుంటున్నారు ఈ సినిమాని.
మహేష్ వచ్చిన 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకొచ్చాడు బన్నీ. త్రివిక్రమ్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీగా రిలీజైంది అల వైకుంఠపురములో. తమన్ పాటలు ఈ సినిమాను సగం హిట్ చేస్తే, బన్నీ-త్రివిక్రమ్ కలిసి మిగతా సగం పనిని పూర్తిచేశారు. అలా అల వైకుంఠపురములో సినిమా ప్రేక్షకులందరి ఆదరణ పొందింది. మహేష్ సినిమాకు వచ్చినట్టుగానే ఈ సినిమాకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతేసి వసూళ్లు వచ్చాయనే చర్చ వివాదాస్పదం అవుతుంది. అందుకే కాస్త కచ్చితత్వంతో కూడిన ఓవర్సీస్ వసూళ్ల పరంగా చూసుకుంటే.. అల వైకుంఠపురములో సినిమానే సంక్రాంతి విన్నర్.
ఇక సంక్రాంతి సీజన్ కు ఫినిషింగ్ టచ్ గా 15వ తేదీన వచ్చింది ఎంత మంచివాడవురా సినిమా. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. మహేష్ బన్నీ సినిమాలు బరిలో ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్ కాబట్టి తన మూవీ కూడా ఆడుతుందని భావించాడు. పైగా సతీష్ వేగేశ్నకు గతంలో శతమానంభవతి రూపంలో ఓ సంక్రాంతి హిట్ ఉంది కాబట్టి, ఆ మేజిక్ రిపీట్ అవుతుందని భ్రమపడ్డాడు. కానీ కంటెంట్ తేలిపోవడంతో.. ఎంత మంచివాడవురా మూవీ సంక్రాంతి బరిలో చతికిలపడింది.
సంక్రాంతి సినిమాల తర్వాత జనవరి 24న రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా వచ్చింది. రవితేజ గత సినిమాల్లానే ఇది కూడా ఎలాంటి చప్పుడు చేయలేదు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. ఇక జనవరి నెల బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. డబ్ స్మాష్, అశ్వథ్థామ, చూసీ చూడంగానే సినిమాలొచ్చాయి. వీటిలో డబ్ స్మాష్ సినిమా ఫ్లాప్ అవ్వగా.. నాగశౌర్య నటించిన అశ్వథ్థామ, రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా నటించిన చూసీ చూడంగానే సినిమాలకు క్రిటిక్స్ అయితే యావరేజ్ మార్కులే వేశారు. బాక్సాఫీస్ రిజల్ట్ తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాలి.
ఇలా జనవరి నెలలో బాక్సాఫీస్ బరిలో 20 సినిమాలు నిలిస్తే.. వీటిలో సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు మాత్రమే క్లిక్ అయ్యాయి. దర్బార్ మూవీ యావరేజ్ అనిపించుకుంది.