చాలా చిన్న వ్యవస్థ అయినప్పటికీ.. అనునిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటుంది తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఈ క్రమంలో నూతన సంవత్సరంలో కూడా మా లో రచ్చ జరిగింది. ప్రముఖ నటుల మధ్యన విబేధాలు వార్తలకు ఎక్కాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో .. జరిగిన గొడవ మీడియాలో హైలెట్ అవుతూ ఉంది.
చిరంజీవి- రాజశేఖర్ ల మధ్యన సాగిన వాదోపవాదాలు మా లో ఉన్న విబేధాలను బహిర్గతం చేశాయి. ఇలాంటి క్రమంలో దాని పరిణామాలు కూడా కొనసాగనున్నాయని తెలుస్తోంది. జరిగిన రచ్చ నేపథ్యంలో.. మా లో తమ హోదాలకు రాజీనామా చేయాలని జీవిత, రాజశేఖర్ లు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. తమ కుమార్తెలతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు వారు ఒక నిర్ణయానికి వచ్చారట.
మా కు రాజీనామా చేసి ఈ గొడవలకు పూర్తిగా దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరకూ కూడా మా లో విబేధాలు రచ్చకు ఎక్కాయి. నరేష్, శివాజీ రాజా, జీవిత, రాజశేఖర్.. మీడియాతో వివిధ వివాదాల గురించి మాట్లాడారు. వాటితో ఇక తమ ప్రమేయం ఉండకుండా జీవిత, రాజశేఖర్ లు రాజీనామాతో తప్పుకోనున్నారని తెలుస్తోంది.