అబ్బే…దానిపై జీవితా అస‌లు వివ‌ర‌ణ ఇవ్వ‌ట్లే!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. పోటీదారుల మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌రం కౌంట‌ర్లు, ఎన్‌కౌంట‌ర్ల‌తో టాలీవుడ్‌లో ఎన్నిక‌లు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌లో బండ్ల గ‌ణేశ్ ప్ర‌క‌ట‌న అల‌జ‌డి సృష్టిస్తోంది.…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. పోటీదారుల మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌రం కౌంట‌ర్లు, ఎన్‌కౌంట‌ర్ల‌తో టాలీవుడ్‌లో ఎన్నిక‌లు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌లో బండ్ల గ‌ణేశ్ ప్ర‌క‌ట‌న అల‌జ‌డి సృష్టిస్తోంది. ప్యాన‌ల్‌లోకి జీవితా రాజ‌శేఖ‌ర్ రావ‌డం త‌న‌కిష్టం లేద‌ని మ‌న‌సులోని మాట‌ను బండ్ల గ‌ణేశ్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. 

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోని బండ్ల గ‌ణేశ్‌కు జీవితా రాజ‌శేఖ‌ర్ త‌గిన స‌మాధానం ఇచ్చారు. అయితే బండ్ల గ‌ణేశ్‌లా ఆమె ఆవేశప‌డ‌లేదు. కూల్‌గా తాను చెప్పాల‌నుకున్న‌ది స్ప‌ష్టం చేశారు. అంతే త‌ప్ప బండ్ల గ‌ణేశ్ తెర‌పైకి తెచ్చిన ప్ర‌ధాన అంశాన్ని ఆమె ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మనార్హం.

‘ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదు. నాకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నాను. ఆమెపై జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను. నమ్మడం – నమ్మిన వారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చేయ‌మంటోంది. అందుకే ఈ పోటీ’ అంటూ బండ్ల చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  

మీడియాతో జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఏమ‌న్నారంటే…

‘ బండ్లగణేశ్‌తో నాకెలాంటి విభేదాలు లేవు. ‘మా’ అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులెవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. బండ్ల గణేశ్‌ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగానో, లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ప్ర‌ధానంగా త‌న‌కు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఎన్నో సార్లు కించపరిచార‌నే ఆరోప‌ణ‌పై జీవిత వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. బండ్ల గ‌ణేశ్ తాను ప్ర‌ధానంగా ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ నుంచి త‌ప్పుకోడానికి… త‌నకు ఇష్ట‌మైన చిరంజీవి కుటుంబంపై ఆరోప‌ణ‌ల‌ను తెర‌పైకి తెచ్చారు. అలాగ‌ని బండ్ల ఆరోప‌ణ‌ల‌ను జీవిత ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) స‌భ్యులెవ‌రైనా పోటీ చేయ‌వ‌చ్చ‌ని కొత్త‌గా జీవితా రాజ‌శేఖ‌ర్ చెప్ప‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. రానున్న కాలంలో టాలీవుడ్ ఎన్నిక‌లు మ‌రెన్ని మ‌లుపులు తిర‌గ‌నున్నాయో!