తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు పొలిటికల్ మైలేజ్ ఎలా ? ఇప్పుడు ఇదీ ప్రధాన ప్రశ్న. షర్మిలను, ఆమె తల్లి విజయమ్మను కూడా వేధిస్తున్న ప్రశ్న కూడా ఇదే. తాజాగా తల్లీ కూతుళ్లు కలిసి నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సభ వారిని తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. ఇది సంస్మరణ సభ కాదని, షర్మిల కోసమే నిర్వహించిన సభ అని అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వైఎస్సార్ అభిమానులకు అర్ధమైపోయింది. దాంతో ఎవరూ ఆ సభకు వెళ్ళలేదు.
ప్రస్తుతం రాజకీయాల్లో లేనివారు. ఉన్నా సరైన గుర్తింపులేనివారు, వైఎస్సార్ హయాంలో పనిచేసి ఆయనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్న కొద్దిమంది మాజీ అధికారులు మాత్రమే వెళ్లారు. షర్మిల తెలంగాణలో అడుగు పెట్టగానే తాను అధికారంలోకి వస్తానంటూ హడావుడి చేయడం ఆమెకు మైనస్ పాయింటయింది. నిజానికి తెలంగాణలో షర్మిల ఎవరో తెలుసుగానీ ఆమెకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ అంటూ లేదు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడగానే ఆమె తెలంగాణాకు వచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉంటే పరిస్ట్గితి ఎలా ఉండేదో.
కానీ అన్న జగన్ మీద కోపంతో, ఆయనతో విభేదించి పార్టీ పెట్టింది. తాను తెలంగాణా కోడలినని, తనకు రాజకీయ పార్టీ పెట్టె హక్కు ఉందని ఎంతగా చెప్పుకుంటున్న తెలంగాణా సమాజం ఆమెను బయటి వ్యక్తిగానే చూస్తోంది. ప్రజలు ఆమెను ఎలా చూస్తున్నా ఆమె మాత్రం ఏదో ఒక అంశం తీసుకొని పోరాటం చేస్తూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆమె తొలి రోజుల్లో ఇందిరా పార్కులో చేసిన నిరాహార దీక్ష, ఆ తరువాత ప్రతి మంగళవారం ఏదో ఒక ఊళ్ళో చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్ష పొలిటికల్ మైలేజీ ఇవ్వడం లేదు.
ఇప్పుడు తెలంగాణా రాజకీయాలు దళితుల చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి షర్మిల కూడా దళిత సమస్యలపై పోరాటం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తరచుగా దళిత బంధు పథకంపై విమర్శలు చేస్తోంది. వ్యంగ్య బాణాలు విసురుతోంది. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో మాట్లాడుతూ … ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద అలిగితే మాట్లాడం మానేస్తాను కానీ పార్టీ పెట్టను.
పార్టీ అంటే వ్యక్తి కాదు… ప్రజలు, వ్యవస్థ. నేను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. నేను ఒంటరినని భయపడను, బాధలేదు. ఇది ప్రజల పార్టీ. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవు గనుక.. ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు పార్టీ పెట్టాను. నేను ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి. రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు. కేసీఆర్ ఒక నియంత.. ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు అని చెప్పింది కానీ ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరుగుతోంది.
ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేంగానీ ఇప్పటివరకైతే షర్మిల పార్టీలో పేరున్న, రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకులు ఎవరూ చేరలేదు. ఇది పెద్ద మైనస్ పాయింట్ షర్మిలకు. వైఎస్ అభిమానులుగా ఉన్న నాయకుల నుంచి కూడా మద్దతు లభించలేదు. షర్మిలకు అంతో ఇంతో పొలిటికల్ మైలేజ్ రావాలంటే ఆమెకు మిగిలిన మార్గం పాదయాత్ర.
ఇప్పటివరకు చూసుకుంటే పాదయాత్ర చేసిన నాయకులంతా ప్రజాభిమానం చూరగొన్నారు. షర్మిల అన్న జగన్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర కూడా ఒక కారణం. అసలు వైసీపీ ఉనికిలో ఉండటానికి కారణం ఒకప్పడు షర్మిల చేసిన సుదీర్ఘ పాదయాత్రే .
తాను వంద రోజుల పాదయాత్ర చేస్తానని పార్టీ ఆవిర్భావం రోజే షర్మిల ప్రకటించింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అక్టోబర్ 18వ తేదీన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడతానని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నది. అంతే కాకుండా తన పార్టీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి తెస్తామో కూడా వివరిస్తానని చెప్పింది.
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ గా భావించే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే యాత్ర ప్రారంభిస్తానని అన్నది. ఏపీ సీఎం జగన్ కోసం 2012 లో పాదయాత్ర చేపట్టిన తేదీ కూడా అక్టోబర్ 18వ తేదీనే కావడం విశేషం. ఇటు తండ్రి పాదయాత్ర చేపట్టిన ప్రాంతం, అటు అన్న కోసం తను యాత్ర చేపట్టిన తేదీ రెండూ కలిసిరావడం శుభసూచికంగా షర్మిల భావిస్తోంది. పాదయాత్ర కలిసి వస్తుందేమో చూడాలి.