జుగుప్సాకర ఓటిటి రాజ్యాంగం?

మనకు దేనికైనా ఓ టార్చ్ బేరర్ వుంటాడు. లేదా ఓ రాజ్యాంగం అన్నది కనిపించకుండా ఏర్పడిపోతుంది. మీడియాకు అనుకోండి ఈనాడు స్టయిల్ లేదా టీవీ 9 స్టార్ట్ చేసిన స్టయిల్. ఇక ఆ తరువాత…

మనకు దేనికైనా ఓ టార్చ్ బేరర్ వుంటాడు. లేదా ఓ రాజ్యాంగం అన్నది కనిపించకుండా ఏర్పడిపోతుంది. మీడియాకు అనుకోండి ఈనాడు స్టయిల్ లేదా టీవీ 9 స్టార్ట్ చేసిన స్టయిల్. ఇక ఆ తరువాత వచ్చేవి అన్నీ అదే దారిన వెళ్తాయి. లాస్ట్ పేజీలో క్రీడా వార్తలు వేసే వారు ఒకప్పుడు అంతా. మూడో పేజీ సంపాదకీయం..ఇది ఎవరూ రాసిన రాజ్యాంగం కాదు. అలా అలవాటు అయిపోయింది. ఎప్పుడో ఎవరో మళ్లీ మారుస్తారు..అక్కడ మళ్లీ మారుతుంది.

సినిమాల్లో క్లయిమాక్స్ ముందు మాస్ పాట వుండాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ వుండాలి. ట్విస్ట్ లేదా ఫైట్ వుండాలి. ఇవన్నీ ఎవరో రాసి పెట్టినవి కాదు. అలా అలా అనూచానంగా వచ్చేసినవి. అప్పుడప్పుడు ఎవరో దీన్ని బ్రేక్ చేస్తారు. మళ్లీ పద్దతి మారుతుంది. పాన్ ఇండియా అయినా రెండు భాగాలు అయినా, కెజిఎఫ్ మోడల్ కలర్ టోన్ అయినా ఇవన్నీ కూడా ఇదే తీరు.

టీవీ కంటెంట్ కు కూడా ఇలాంటి వ్యవహారమే వుంది. అది ఎవ్వరూ బ్రేక్ చేయడం లేదు. అందుకే ఆ ఫ్యామిలీ కన్నీళ్ల సీరియళ్లే రన్ అవుతున్నాయి. ఒకప్పుడు పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, భక్తి ట్రయ్ చేసారు కానీ వీటిని బ్రేక్ చేయలేకపోయారు.

ఇప్పుడు ఓటిటి సంగతి చూద్దాం. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లో ఎవరో ముందుగా దారి తీసారు. బూతు డైలాగులు వుండాలి. సాని కొంపలు, ముందు నుంచి వెనకు నుంచి ఊగడాలు, భయంకరమైన, జుగుప్సాకరమైన సీన్లు వుండాలి. దాన్నే మన తెలుగు వెబ్ సిరీస్ లు కూడా ఫాలో ఫాలో అన్నాయి కొన్నాళ్ల క్రిందట. తెలుగు ఓటిటి వచ్చినా కూడా వాటిలో మన ఘనత వహించిన సినిమా దర్శకులు కంటెంట్ అందించినా కూడా ఇలాంటి చెత్త రాజ్యాంగాన్నే ఫాలో అయ్యారు. తరువాత మన వాళ్లకు అవి నచ్చవు అని తెలిసి మనవాళ్లు అలాంటి వాటికి దూరం అయ్యారు.

ఇలాంటి టైమ్ లో నెట్ ఫ్లిక్స్, ఇంకా మరి కొన్ని బడా ఓటిటి లు మన ఇళ్లలోకి రావడం ప్రారంభమైంది. ఏ పెద్ద ఓటిటి సంస్థ చేసిన సిరీస్ లు అయినా ఫస్ట్ సమస్య డైలాగులు. హిందీలో చేసిన వెబ్ సిరీస్ లను తెలుగులో తర్జుమా చేస్తున్నారు. మన రచయితలే రాయాలి దేనికైనా. అక్కడ భాషను ఇక్కడ పరమ రోత బూతు మాటలతోనే తర్జుమా చేస్తున్నారు. కాస్త పాలిష్ చేసే అవకాశం వున్నా, మేకర్లు ఒప్పుకోకపోవడంతో, రచయితలకు తప్పడం లేదు. వచ్చే ఆదాయాన్ని ఈ మడికట్టు కోసం వదులుకోరు కదా.

మంచి మంచి వెబ్ సిరీస్ ల్లో కూడా పంటి కింద రాళ్లలా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తున్నా, కంటెంట్ కోసం చిన్న చిన్న రాళ్లు ఏరుకుని చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కథ కాస్తా రాళ్ల చందంగా మారింది. మిగిలిన చెత్త అంతా నిండిపోతోంది. వెబ్ సిరీస్ లు అంటే ఇలాగే వుండాలేమో, ఇలాగే వుండాలి అనే రాజ్యాంగం ఒకటి రెడీ అయిపోతోంది.

లేటెస్ట్ గా వచ్చిన రానా నాయుడు మీద సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. ఇంత అసహ్యమైన వెబ్ సిరీస్ చేయడం అవసరంమా వెంకటేష్ అని నిలదీస్తోంది. ఇక్కడ వెంకటేష్ తప్పేమిటంటే దాంట్లో నటించడం. ఎవరో ఒకరు నటించడం వేరు. వెంకీ నటించడం వేరు. వెంకీకి ఓ ఫ్యామిలీ ఇమేజ్ వుంది. దాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా వాడి నెట్ ఫ్లిక్స్ తెలుగు ఇళ్లలోకి దూరాలనుకుంటోంది. మొదటి దాని విషయంలో జనం మోసపోవచ్చు. కానీ మళ్లీ వెంకీ మరోటి చేస్తే ఇక అటు పక్క చూడమన్నా చూడరు.

ఫిలాసఫీ, వేదాంతం..ఇలాంటి భావనలు వుంటే సరిపోదు. వెంకీ దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. కేవలం పది పన్నెండు కోట్లు ఇస్తారు కదా అని సమాజ హితం కాని ఇలాంటి వాటిలో నటించి, ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సరి కాదు. దేశాన్ని మారుస్తాం, వ్యవస్థలను మారుస్తాం…హిందూత్వ భావాలు పెంచుతాం, ఫిబ్రవరి 14న కర్రలు పట్టుకుని తిరుగుతాం అనే వాళ్లు కూడా ఇలాంటి ఓటిటి లకు ముకుతాడు వేయకపోవడం కచ్చితంగా శోచనీయం.