హీరోయిన్లు మెల్లమెల్లగా ఓటీటీకి షిఫ్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా కాజల్ ఓ ప్రయోగం చేసింది. లైవ్ టెలికాస్ట్ పేరిట ఓ వెబ్ సిరీస్ చేసింది కాజల్. కేవలం ఇది ఆమెకు కొత్త వేదిక మాత్రమే కాదు, కొత్త సబ్జెక్ట్ కూడా. కాజల్ చేసిన మొట్టమొదటి హారర్ కాన్సెప్ట్ ఇది.
హాట్ స్టార్ లో ప్రసారమైన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. రాంగ్ టైమ్ లో స్ట్రీమింగ్ కు పెట్టడం, సరిగ్గా ప్రమోషన్ చేయలేకపోవడం వల్ల తన తొలి ఓటీటీ డెబ్యూ బెడిసికొట్టిందని కాజల్ స్వయంగా ఆమధ్య ప్రకటించింది. ఇప్పుడు కాజల్ ఫ్రెండ్ తమన్న వంతు వచ్చింది.
తమన్న కూడా ఓటీటీలోకి ఎంటరైంది. ఆమె చేసిన వెబ్ సిరీస్ ''లెవెన్త్ అవర్''. ఓ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్.. ఏప్రిల్ 9న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తమన్న తొలిసారి నటించిన ఫుల్ లెంగ్త్ ఒరిజినల్ మూవీ ఇది.
ఈ సిరీస్ కోసం తమన్న చాలా కష్టపడింది. ఒక దశలో ఈ సిరీస్ షూటింగ్ సమయంలో ఆమె కరోనా బారిన కూడా పడింది. ఎట్టకేలకు ఈ థ్రిల్లర్ తో ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది తమన్న.