బీజేపీ అనుకున్న‌దొక్క‌టీ, అవుతున్న‌ది మ‌రొక‌టి!

ఏపీ రాజ‌కీయంలో విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి ప్ర‌తిస్పంద‌న‌ను ఎదుర్కొందో, స‌రిగ్గా ఇప్పుడు బీజేపీ అలాంటి ప‌రిస్థితిల్లో క‌నిపిస్తూ ఉంది. సీమాంధ్ర ప్ర‌జ‌ల‌కు ఆమోదం లేని విభ‌జ‌న‌కు పాల్ప‌డి తీవ్ర‌మైన…

ఏపీ రాజ‌కీయంలో విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి ప్ర‌తిస్పంద‌న‌ను ఎదుర్కొందో, స‌రిగ్గా ఇప్పుడు బీజేపీ అలాంటి ప‌రిస్థితిల్లో క‌నిపిస్తూ ఉంది. సీమాంధ్ర ప్ర‌జ‌ల‌కు ఆమోదం లేని విభ‌జ‌న‌కు పాల్ప‌డి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. ద‌శాబ్దాల చ‌రిత్ర‌, ప‌టిష్ట‌మైన క్యాడ‌ర్, గొప్ప  నాయ‌క‌త్వం ఇవ‌న్నీ.. ఉన్నా.. ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్ చిత్తు అయ్యింది. 

సీమాంధ్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల కాంగ్రెస్ గ‌ల్లంత‌య్యింది. ద‌శాబ్దాల చ‌రిత్ర ఒకే ఎన్నిక‌తో తుడిచి పెట్టుకుపోయింది. ద‌శాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని ఏలిన కాంగ్రెస్ .. చేజేతులా త‌న తోక‌కు త‌నే నిప్పు పెట్టుకుంది. ఒకే ఒక నిర్ణ‌యంతో మాడి మ‌స‌య్యింది కాంగ్రెస్ పార్టీ.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితి కూడా అలానే క‌నిపిస్తూ ఉంది. విభ‌జ‌న పాపంలో బీజేపీకీ కావాల్సినంత వాటా ఉంది.  విభ‌జించింది తామే అని, తాము కూడా అని బీజేపీ తెలంగాణ‌లో గ‌ర్వంగా చెప్పుకుంటుంది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే.. బీజేపీ చేసిన ద్రోహాల‌న్నీ చెరిగిపోయేలా లేవు. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారం చేతిలో ఉన్నా.. ఆహామీల‌ను నెర‌వేర్చ‌డానికి ఏ మాత్రం సానుకూలంగా లేదు క‌మ‌లం పార్టీ. 

ఎంత‌దారుణం అంటే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం వ‌ల్ల బీజేపీకి రాజ‌కీయంగా లాభ‌మే త‌ప్ప‌, ప‌క్క రాష్ట్రాల్లో వ‌చ్చే న‌ష్టం కూడా లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ర్ణాట‌క‌కు ఎలాంటి న‌ష్టం లేదు. కావాల్సినంత పారిశ్రామికాభివృద్ధిని సాధించింది క‌ర్ణాట‌క‌. అక్క‌డ ఏపీ విష‌యంలో తీవ్ర‌మైన ప్రాంతీయ ద్వేషాలు కూడా లేవు. ఇక త‌మిళ‌నాడులో బీజేపీకి బిచాణా లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ప‌ట్ల తెలంగాణ కూడా గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌లేదు. వ్య‌తిరేకించినా న‌ష్టం లేదు. హైద‌రాబాద్ లోని సెటిల‌ర్లు కూడా బీజేపీ ప‌ట్ల సానుకూల ధోర‌ణిగా వ‌స్తారు.

అన్నింటికీ మించి ఏపీలో బీజేపీకి కొంత బేస్ మెంట్ ఏర్పడుతుంది. బ‌హుశా తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌కు మించి బీజేపీకి మంచి ముహూర్తం లేదు. ఏపీకి త‌క్ష‌ణం ప్ర‌త్యేక‌హోదాను ప్ర‌క‌టిస్తే… ఆ పార్టీకి ఇక్క‌డ ఊపు రావొచ్చు. ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ ఉనికి పాట్లు ప‌డుతున్న వేళ‌.. పుంజుకోవ‌డానికి బీజేపీకి ఇది గొప్ప రాజ‌కీయ వ్యూహ‌మే అవుతుంది. మ‌రి ఇంత అనుకూలంగా ఉన్నా.. ప్ర‌త్యేక‌హోదా ప‌ట్ల సానుకూలంగా స్పందించ‌ని బీజేపీ.. తిరుప‌తి బై పోల్ లో చిత్త‌వుతుందనే అంచ‌నాల్లో పెద్ద వింత లేక‌పోవ‌చ్చు!

ఇక ప్ర‌త్యేక‌హోదా మాత్ర‌మే కాదు, కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌ ఇంకా అనేక ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ధ‌ర‌ల నియంత్ర‌ణ ప‌ట్ల మోడీ ప్ర‌భుత్వం ఎలాంటి ఆస‌క్తిని చూపించ‌డం లేదు. స‌ర్వ‌ధ‌ర‌ల పెరుగుద‌ల‌కూ కార‌ణ‌మైన పెట్రో ధ‌ర‌ల‌ను కేవ‌లం లాభం లెక్క‌లోనే చేస్తున్న‌ట్టుగా ఉంది క‌మ‌లం ప్ర‌భుత్వం. సామాన్యుడి న‌డ్డి విరుగుతున్నా మోడీ ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని స్ప‌ష్టం అవుతోంది. 

ఉత్త‌రాదిన ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాల త‌మ‌కు తెలుసు కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల విష‌యంలో ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌ని బీజేపీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టుగా ఉంది. ధ‌ర‌ల  పెరుగుద‌ల‌, ఇత‌ర ప్ర‌జా వ్య‌తిరేక అంశాలు ఉత్త‌రాదిన బీజేపీని ఏ మేర‌కు ప్ర‌భావితం చేస్తాయో కానీ.. సౌత్ లో మాత్రం.. దీని ప‌రిణామాలు ఓటుతో ఎదుర్కోవాల్సి ఉంటుంది క‌మ‌లం పార్టీ.

బీజేపీ వాళ్లు, వారి భ‌క్తులు ఒప్పుకోక‌పోవ‌చ్చు కానీ.. పెట్రో, గ్యాస్ ధ‌ర‌ల పెంపు.. నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ లేక‌పోవ‌డం .. ఈ అంశాల‌న్నీ.. బీజేపీపై మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో వ్య‌తిరేక‌త‌ను పెంచుతున్నాయి. ఆ ప్ర‌భావం సౌత్ లో ఏ ఎన్నిక‌లు జ‌రిగిన స్ప‌ష్టంగా ప‌డే అవ‌కాశం ఉంది. వాటికి తోడు విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వంటి అంశాలు కూడా.. తిరుప‌తి బై పోల్ లో బీజేపీ ఎదుర్కొనాల్సి ఉంది.

బీజేపీ ద‌గ్గ‌ర ఇప్పుడున్న‌ది కేవ‌లం మ‌తం అంశం మాత్ర‌మే! ఆ అంశాన్ని అస్త్రంగా  మార్చుకోవాల‌ని క‌మ‌లం క‌ల‌లు క‌న్న‌ది. అయితే.. ఏపీలో ప్ర‌జ‌ల విజ్ఞ‌త ముందు బీజేపీ చ‌ల్లుతున్న మ‌తం మందు కూడా ప్ర‌భావం చూపేలా లేదు. త‌మ‌ది హిందూ మ‌తోద్ధార‌క పార్టీ అని బీజేపీ చెప్పుకుంటున్నా.. హిందువులు కూడా దాన్ని న‌మ్మే ప‌రిస్థితి లేదు. దానికి అనేక కార‌ణాలున్నాయి. టీటీడీ నుంచి కూడా అయిన కాడికి జీఎస్టీని వ‌సూలు చేసుకోవాల‌నే లెక్క‌ల‌తోనే ఉంది కేంద్ర ప్ర‌భుత్వం. 

హిందూ ప్ర‌చార‌క ప‌నులు మాత్ర‌మే చేసే టీటీడీకి కూడా జీఎస్టీ నుంచి మిన‌హాయింపులు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇక బీజేపీ ఏర‌కంగా హిందుత్వాన్ని ర‌క్షిస్తున్న‌ట్టు? ఏర‌కంగా హిందుత్వ‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న‌ట్టు? అనే ప్ర‌శ్న‌లూ ఉత్ప‌న్నం అవుతున్నాయి. అటు ఏపీకి ద్రోహం చేయ‌డం విష‌యంలో, ఇటు ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల విష‌యంలో.. ఇక మ‌తం అంశంలో కూడా బీజేపీ ఏపీకి స‌మాధానం ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈ ప్ర‌భావం అంతా తిరుప‌తి బై పోల్ లో అంతా స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.