సెలబ్రిటీలు, స్టార్స్ మైనపు విగ్రహాలు వరుసగా కొలువుదీరుతున్నాయి. మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో.. కొత్తగా బ్యాంకాక్, సింగపూర్ లో బ్రాంచీలు తెరిచింది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ఇందులో భాగంగా ఇప్పటికే సింగపూర్ బ్రాంచ్ లో మహేష్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది.
మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ బ్రాంచ్ లో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లింది కాజల్. తన మైనపు బొమ్మ పక్కన, అదే భంగిమలో నిల్చొని ఫొటోలకు పోజులిచ్చింది. సౌత్ నుంచి టుస్సాడ్స్ లో స్థానం పొందిన తొలి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
శ్రీదేవి మైనపు విగ్రహాన్ని టుస్సాడ్స్ నిర్వహకులు చెడగొట్టారు. అతిలోకసుందరి ముఖ కవలికల్ని యథాతథంగా పునఃప్రతిష్టించలేకపోయారు. అదే తప్పు కాజల్ విషయంలో కూడా జరుగుతుందని చాలామంది భయపడ్డారు. కానీ కాజల్ మైనపు బొమ్మ అచ్చుగుద్దినట్టు కాజల్ లానే ఉంది. బుగ్గలు, పెదవుల విషయంలో ఈసారి ఎలాంటి మిస్టేక్స్ జరగలేదు.
మహేష్ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ మాల్ లో ఉంచారు. తన విగ్రహావిష్కరణకు కుటుంబంతో పాటు వచ్చాడు మహేష్. తర్వాత ఫ్యాన్స్ అంతా ఆ విగ్రహంతో సెల్ఫీలు కూడా దిగారు. కాజల్ విషయంలో ఇలాంటి వెసులుబాటు దక్కలేదు. ఆమె విగ్రహాన్ని నేరుగా సింగపూర్ బ్రాంచ్ లోనే పెట్టారు.