బిగ్‌బాస్ సీజన్ -4 రియాల్టీ షో స్టార్ మా చానల్‌లో అంగరంగ వైభవంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయింది. హోస్ట్ నాగార్జున ఒక్కో కంటెస్టెంట్‌ను పరిచయం చేస్తూ…మొత్తం 16 మందిని బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. షో మధ్యలో ఆటపాటలు అలరించాయి.
ఈ షోలో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి గురించి తప్పక చేసుకోవాలి. ఈ సందర్భంలో తన జీవితంలోని విషాదాన్ని ఆమె ఏడుస్తూ చెప్పారు. కరాటే కళ్యాణి జీవితం వెనుక ఇంత విషాదం ఉందా? అనే ఆవేదన అందరిలోనూ కలిగింది. వెండితెరపై నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే కళ్యాణి బిగ్‌బాస్‌లో ప్రవేశించే ముందు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.
తన జీవితంలో పెళ్లిళ్లు కలిసి రాలేదని, తనను అందరూ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణి అనే పేరు తప్ప, ఆమెకు రియల్ లైఫ్‌లో కళ్యాణం కలిసి రాలేదనే విషయం ఆమె మాటల ద్వారా అర్థమైంది. కాగా తనకు గర్భం నిలబడక పోవడం మానసికంగా ఎంతో కుంగదీసిందన్నారు. తన కడుపు అలా ముందుకు రావడాన్ని చూసుకుని మురిసిపోవాలనే కల తీరనే లేదని వాపోయారు. దీంతో ఒక అనాథ బాబును పెంచుకుంటున్నానని, ఇప్పడు ఆ పిల్లోనికి పదేళ్లని కళ్యాణి చెప్పుకొచ్చారు.
భవిష్యత్‌లో కూడా అనాథలను ఆదుకుంటానని నాగార్జున ఎదుట ఆమె హామీ ఇచ్చారు. హోస్ట్ నాగార్జున కూడా కళ్యాణి మానవత్వానికి ముగ్ధుడయ్యారు. చాలా గొప్ప పని చేస్తున్నావని కళ్యాణిని అభినందించారు. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వివాదం నడుస్తున్న సందర్భంలో కరాటే కళ్యాణి తరచూ టీవీ డిబేట్లకు వెళుతూ…బలమైన వాయిస్ వినిపించే వారు. ఆ సందర్భంలో ఆమె ఫేస్ అందరికీ పరిచయమైంది. శ్రీరెడ్డితో గొడవ కూడా ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. మరోసారి బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీతో కళ్యాణి తానేమిటో తెలుసుకునే అవకాశం దక్కించుకున్నారు.