ఆర్జీవీ లేటెస్ట్ సెన్సేషన్ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమా ఈ నెల 29న విడుదల చేయాల్సి వుంది. కోర్టులో కేసులు వున్నాయి. అది వేరే సంగతి. కోర్టులు కేసు టేకప్ చేసి, ఏదో ఒక ఆదేశం ఇస్తే అది వేరే సంగతి. అలా కాకున్నంత వరకు ఫరవాలేదు. ఇక అసలైన ఇబ్బంది సెన్సారు ఒక్కటే. ఇప్పుడు అదే సమస్యగా మారింది.
పోనీ అలా అని సెన్సారు అధికారి సినిమా చూసేసి, ఎడా పెడా కట్ లు చెప్పేసి, అదీ ఇదీ తీసేయండి అని అన్నారా? అంటే అదీ లేదు. అస్సలు సినిమా చూడలేదు. అంతే. ఇదిగో చూస్తా..అదిగో చూస్తా అని అంటున్నారని బోగట్టా. అప్పటికీ అర్జెంట్ గా చూడమని అఫడవిట్ ఏదో దాఖలు చేసినట్లు కూడా తెలుస్తోంది.
సెన్సారు అధికారులు చూసి, అవునో కాదో చెప్పేస్తే, రివిజన్ కు వెళ్లడమో, ఇంకా మరేదో విధంగా సాధించుకు రావడమో చేసే అవకాశం వుంటుంది. అలా కాకుండా అలా పెట్టుకుని వుంచేస్తే, డేట్ దగ్గరకు వచ్చేసి, సమస్య అవుతుంది నిర్మాతలకు
రెండు రోజులుగా ఈ విషయంలో వేచి చూసిన ఆర్జీవీ విసిగిపోయినట్లు తెలుస్తోంది. అందుకే బుధవారం నాడు మీడియా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈలోగా సెన్సారు వారు చూస్తామంటారేమో? చూడాలి. లేదూ అంటే రేపు ఆర్జీవీ మాటల తూటాలు పేల్చే అవకాశం వుంది.