తను శుద్ధపూస అని చెప్పుకుంటూ.. అందరి మీదా నిందలేస్తూ సాగుతోంది నటి కంగనా రనౌత్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలందరినీ జాయింటుగా టార్గెట్ చేసింది కంగనా. రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ ల రక్తాన్ని పరిశీలించాలని, వారు డ్రగ్స్ వాడుతున్నారో లేదో పరీక్షించాలని ఈమె ఉచిత సలహా ఇచ్చింది. అంతేకాదు.. 99 శాతం మంది బాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించింది.
ఆ ఒక్క శాతంలో తనను తాను మినహాయించుకుంది కాబోలు. తను కూడా డ్రగ్స్ వాడినట్టుగా.. కెరీర్ ఆరంభంలో తన మెంటర్ తనకు ఆ డ్రగ్స్ ఇచ్చినట్టుగా కంగనా ఇప్పటికే చెప్పింది. తను మాత్రం ఏదో పొరపాటును డ్రగ్స్ తీసుకున్నట్టుగా.. మిగతా వాళ్లంతా ఇచ్ఛాపూర్వకంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఈమె చెప్పుకొచ్చింది.
అయితే తను ఏ బేస్ తో ఆ హీరోలందరి మీదా, బాలీవుడ్ మీద ఈ ఆరోపణలు చేసినట్టో కంగనా వివరించలేదు. అయితే కొందరు నెటిజన్లు ఈమె మీద విరుచుకుపడుతున్నారు. డ్రగ్స్ వాడటం నిజమే అయితే కంగనా కూడా దానికి మినహాయింపు కాదని దుమ్మెత్తిపోస్తున్నారు. శేఖర్ తనయుడు అధ్యాయన్ సుమన్ ఒక ఇంటర్వ్యూలో కంగనా గురించి మాట్లాడాడు అని, ఆ పాత ఇంటర్వ్యూలో కొకైన్ వాడమని కంగనా తనను కోరినట్టుగా అధ్యాయన్ చెప్పాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
నార్కోటిక్ డిపార్ట్ మెంట్ వాళ్లు ముందు కంగనాను, అధ్యాయన్ ను అరెస్టు చేయాలని కామెంట్లు పెడుతున్నారు. తనను తాను శుద్ధపూసగా అభివర్ణించుకుంటున్నా.. కంగనా మీదా ఇలాంటి ఆరోపణలు ఉండనే ఉండటం గమనార్హం.