సెప్టెంబర్ వస్తోంది.. సందడి తెస్తోంది

లాక్ డౌన్ వల్ల చాన్నాళ్లుగా స్తబ్దుగా మారిన టాలీవుడ్ కు సెప్టెంబర్ మాసం సరికొత్త ఉత్సాహాన్ని అందించబోతోంది. అవును.. చాలా సినిమాలు ఈ నెలలోనే మళ్లీ షూటింగ్స్ ప్రారంభించబోతున్నాయి. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలు…

లాక్ డౌన్ వల్ల చాన్నాళ్లుగా స్తబ్దుగా మారిన టాలీవుడ్ కు సెప్టెంబర్ మాసం సరికొత్త ఉత్సాహాన్ని అందించబోతోంది. అవును.. చాలా సినిమాలు ఈ నెలలోనే మళ్లీ షూటింగ్స్ ప్రారంభించబోతున్నాయి. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. అలా సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ కార్యకలాపాలు గాడిలో పడబోతున్నాయి.

సెప్టెంబర్ నుంచి ప్రభాస్ సెట్స్ పైకి రాబోతున్నాడు. ఇతడు నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రాధేశ్యామ్. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాను సెప్టెంబర్ 20 నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. దీనికోసం రామోజీ ఫిలింసిటీలో ఓ ఫారిన్ సెట్, మరో హాస్పిటల్ సెట్ వేశారు. ఈ సెట్స్ లోనే షూటింగ్ మొదలవుతుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్
అవుతుంది.

ఇక నాగార్జున కూడా సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు. అతడు నటిస్తున్న వైల్డ్ డాగ్ మూవీ కొత్త షెడ్యూల్ రేపట్నుంచే మొదలు కాబోతోంది. దీంతో పాటు సెప్టెంబర్ మాసంలో బిగ్ బాస్ సీజన్-4 కూడా స్టార్ట్ చేయబోతున్నాడు నాగ్.

నాగచైతన్య కూడా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సెప్టెంబర్ 7 నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ను పునఃప్రారంభించబోతున్నాడు చైతూ. సింగిల్ షెడ్యూల్ లో  ఈ వర్క్ పూర్తిచేసి, ఆ వెంటనే విక్రమ్ కుమార్ డైరక్షన్ లో 'థ్యాంక్ యూ' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనేది ఇతడి ఆలోచన.

సత్యదేవ్-తమన్న హీరోహీరోయిన్లుగా రీసెంట్ గా మొదలైన 'గుర్తుందా శీతాకాలం' సినిమా కూడా సెప్టెంబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ మోడ్ లోకి వెళ్లబోతోంది. సెప్టెంబర్ మిడ్ లో ఈ సినిమా పట్టాలపైకి వస్తుంది.

దర్శకుడు సతీష్ వేగేశ్న తాజాగా 'కోతికొమ్మచ్చి' అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. తన కొడుకు సమీర్, దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంష్ హీరోలుగా ఈ సినిమాను సెప్టెంబర్ చివరి వారం నుంచి సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు ఈ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు.

వీళ్లతో పాటు సంపత్ నంది కూడా ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్స్ లో ఉన్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కు ఓ కథ ఇచ్చాడు సంపత్ నంది. ఊర్వశి రౌథేలా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతున్న ఈ సినిమాను సెప్టెంబర్ లోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. దీంతో పాటు గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమా కొత్త షెడ్యూల్ ను కూడా సెప్టెంబర్ లో ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఆగస్ట్ లోనే సీటీమార్ కొత్త షెడ్యూల్ అనుకున్నారు కానీ సెప్టెంబర్ కు వాయిదాపడింది.

ఇలా కొన్ని బడా మూవీస్ తో పాటు మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వస్తుండడంతో.. సెప్టెంబర్ లో టాలీవుడ్ లో చిన్నపాటి సందడి వాతావరణం కనిపించనుంది.  ఆల్రెడీ చాలా చిన్న సినిమాలు సెట్స్ పైకి వచ్చేశాయి. ప్రభాస్, నాగార్జున, నాగచైతన్య సినిమాల షూటింగ్స్ కూడా మొదలైతే టాలీవుడ్ కు కళ వస్తుంది.

పవన్ సార్ గురించి ఏం చెప్పాలి