వివాదాలను వెదుక్కొంటూ ఉన్నట్టుగా కామెంట్లు చేసే కంగనా రనౌత్ తనకు ఫాలోయింగ్ తగ్గిపోతోందని బాధపడుతోంది. ట్విటర్లో తన ఫాలోయర్లు రోజుకు 40 నుంచి 50 వేల మంది తగ్గిపోతూ ఉన్నారని స్వయంగా ట్వీటేసింది కంగనా! వాస్తవానికి ట్విటర్ తో కూడా సున్నం పెట్టుకున్నారు కంగనా ఆమె సోదరి. ఆ మధ్య ట్విటర్ మీద అలిగారు. ఆ తర్వాత మళ్లీ కంగనా ట్విటర్ ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చాకా ఫాలోయర్ల సంఖ్య బాగానే పెరిగిందట. వన్ మిలియన్ స్థాయికి రీచ్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఫాలోయర్ల సంఖ్య బాగా తగ్గిపోతోందని.. ఏకంగా రోజుకు 40 నుంచి 50 వేల మంది అన్ ఫాలో అవుతున్నారని కంగనా చెబుతోంది. కొత్త వాళ్లు వస్తున్నా.. అన్ ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య కూడా భారీగా ఉందట! దీనికి కారణం ఏమిటో చెప్పాలని.. స్వయంగా ట్విటర్ ఇండియా ఖాతాను ట్యాగ్ చేస్తూ కంగనా ట్వీట్ చేసింది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక సామెత ఉంది. బహుశా కంగనాకు దాన్ని ఎవరైనా హిందీలోకి అనువదించి చెప్పాలేమో! వివాదాలను వెదుక్కొంటూ తను తప్ప మిగిలిన వాళ్లంతా పనికిమాలిన వాళ్లే అని ఎవ్వరినీ వదలకుండా అందరినీ తిడుతూ ఉంటే కంగనాను ట్విటర్లో జనాలు అన్ ఫాలో చేయడంలో పెద్ద వింత లేదేమో! బాలీవుడ్ జనాల్లో ఒక్కరికంటే ఒక్కరికి కూడా వ్యక్తిత్వం లేదని ఈమె నిందిస్తూ ఉంటుంది. వారు డ్రగ్స్ వాడుతున్నారని అంటూ కూడా తాజాగా ఆరోపణలు గుప్పించింది. తను మాత్రం ఉత్తమురాలిని అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకుంది. ఈ విడ్డూరపు ట్వీట్లను తట్టుకోలేకే జనాలు ఆన్ ఫాలో కొట్టినట్టుగా ఉన్నారు!