దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీత స్థాయిలో పెరుగుతున్నా… దేశవ్యాప్తంగా ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణ విషయంలో అస్సలు తగ్గడం లేదు కేంద్ర ప్రభుత్వం. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు రెడీ అయిపోయింది. ఇప్పటి వరకూ కరోనా బాధితుల్లో 20 యేళ్ల లోపు వయసు వారు తక్కువగా ఉన్నారు. దానికి కారణం.. స్కూళ్లు బంద్ అయిపోవడం, ఆఖరికి పిల్లలను ట్యూషన్లకు పంపడానికి కూడా తల్లిదండ్రులు సమ్మతించకపోవడం. పిల్లలను గట్టిగా ఇంటికి పరిమితం చేయడంతో ఆ వయసు వారి విషయంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది.
అయితే ఇప్పుడు ఎంట్రన్స్ టెస్టులు అంటున్నారు. అది కూడా ఒక రోజుతో అయిపోయేది కాదు. పక్షం రోజుల వ్యవధిలో ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ప్రభుత్వం మాత్రం వెనుకాడటం లేదు. ఉత్తరాదిన మాత్రం ఇందుకు సంబంధించి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి.
80 శాతం మంది విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని.. అలా వారు పరీక్షలకు సమ్మతంతో ఉన్నట్టని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తున్న వాళ్లు అంటున్నారు. పరీక్షలు పెడుతున్నారంటే..ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుంటారు. తప్పనిసరి పరిస్థితులను కల్పించాకా.. మళ్లీ ఈ వాదనకు ఉన్న విలువెంత? అనేది ఆలోచించాల్సిన అంశం.
అయితే ఇక్కడ ఏపీ వ్యవహారాలను గుర్తు చేయాలి. పదో తరగతి పరీక్షలను పెట్టాలని ఆ మధ్య ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. 11 పేపర్లకు గానూ కనీసం ఐదు పేపర్ల పరీక్షలను నిర్వహించి, విద్యార్థులకు మార్కులతో ఉత్సాహాన్ని ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే ఏపీలో కొంతమంది గగ్గోలు పెట్టారు. అసెంబ్లీని తక్కువ రోజుల్లో నిర్వహిస్తారు, పరీక్షలు అవసరమా? అని మేధావులు ప్రశ్నించారు. అప్పటికి కరోనా వ్యాప్తి ఈ స్థాయిలో లేదు కూడా.
ఇప్పుడు రోజుకు 80 వేల కేసులు రిజిస్టర్ అవుతున్న సమయంలో.. కేంద్రం లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు పెడుతోంది, ఇప్పుడు మాత్రం తెలుగు మేధావులు కిక్కురుమనడం లేదు. జగన్ ఏం చేయాలని చూసినా వీళ్లు తుమ్ముతారు, అదే కేంద్రం విషయంలో కిక్కురుమనలేని పరిస్థితి వీళ్లది!