పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో హీరో రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌తో ఇంటర్వ్యూ…
'ది వారియర్' ట్రైలర్ బావుంది. ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్. కథ చెప్పే ముందు పోలీస్ కథ అని తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానేదే సినిమాకి మెయిన్ అవుతుంది. 'ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మాస్, కమర్షియల్ సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు!
'ఇస్మార్ట్ శంకర్' కంటే ముందే మారింది. అందుకే, ఆ సినిమా చేశా.
లింగుస్వామికి ఈ మధ్య పెద్ద విజయాలు లేవు. ఆయనతో సినిమా చేయడానికి కారణం?
అటువంటి లెక్కలు వేసుకుంటే 'ఇస్మార్ట్ శంకర్' కూడా చేసేవాడిని కాదు. పూరి జగన్నాథ్, లింగుస్వామి ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ… వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బావుంటుంది.
బుల్లెట్, విజిల్ సాంగ్స్ ఛార్ట్‌బస్టర్స్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి
మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి… రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. సాంగ్స్ మాత్రమే కాదు… కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్… కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది.
'ది వారియర్'తో మీరు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు
నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్… రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది.
తమిళ్ వెర్షన్ డబ్బింగ్ కూడా ఫాస్ట్ గా చెప్పారట
రామ్: నేను చెన్నైలో పెరిగాను కదా! తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. నేను ఒక్కడినే డబ్బింగ్ చెబుతా. వేరే వాళ్ళు ఉండటం ఇష్టం ఉండదు. కరెక్షన్స్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. లింగుస్వామితో అదే చెప్పాను. నేను మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతానని అన్నాను. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి షాక్ అయ్యారు. 'అంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు' అని అన్నారు.
కృతి శెట్టి గురించి
వర్క్ మీద ఆమెకు చాలా డెడికేషన్ ఉంది. గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి.
బోయపాటితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని, భారం అంతా ఆయన మీద వేశా.
బోయపాటి శ్రీను తర్వాత హరీష్ శంకర్ సినిమానా? అనిల్ రావిపూడి సినిమానా?
అందరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కరోనా వల్ల మనకు బ్రేక్స్ వచ్చాయి. అందుకని, 'ది వారియర్' విడుదల తర్వాత బోయపాటి శ్రీను సినిమా స్టార్ట్ చేస్తున్నాను.