ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అలకబూనారు. రక్షణగా కొత్త సిబ్బందిని నియమించగా… ఆయన వెనక్కి పంపి నిరసన తెలిపారు. గన్‌మెన్‌లు లేకుండానే తిరుగుతా అంటూ జగన్ ప్రభుత్వంపై ఆయన అలిగడం గమనార్హం. అయితే ఈ ప్రభుత్వం ఇలాంటివి పట్టించుకోదని పయ్యావులకు తెలిసినట్టు లేదు.
పయ్యావుల కేశవ్ ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఒన్ ప్లస్ ఒన్ భద్రత కల్పించింది. తనకు టూ ప్లస్ టూకు భద్రత పెంచాలని కోరుతూ ఇటీవల నిఘా విభాగం అధికారులకు పయ్యావుల కేశవ్ లేఖ రాశారు.
ఆ తర్వాత రోజే ఏపీ ప్రభుత్వం అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతోందని సంచలన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో భద్రత పెంచడం అటుంచి, ఉన్న దాన్నే తొలగించిందని పయ్యావుల ఆరోపించారు.
కొత్త గన్‌మెన్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వారు పయ్యావుల దగ్గరికి వెళ్లారు. అయితే వచ్చిన వారు గన్‌మెన్లే అని నమ్మకం ఏంటని పయ్యావుల ప్రశ్నించారు. గన్‌మెన్లను మార్చినప్పుడు నిబంధనల ప్రకారం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వచ్చి చెప్పాలని సదరు కొత్త గన్‌మెన్‌తో పయ్యావుల అన్నారు.
రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వచ్చి పరిచయం చేసి వెళ్లే వరకూ విధుల్లో చేరొద్దని పయ్యావుల వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది లేకుండానే పయ్యావుల కేశవ్ ఇవాళ విజయవాడలో చంద్రబాబు ఇంటికి వెళ్లారు.
మీడియాతో మాట్లాడుతూ గన్‌మెన్ అంటూ తన దగ్గరికి నిన్న వచ్చిన వ్యక్తి ఎటు వెళ్లాడో తెలియదన్నాడు. గన్‌మెన్ లేకుండానే తిరుగుతున్నట్టు చెప్పాడు. ఏం జరుగుతుందో చూద్దామని పయ్యావుల అన్నాడు. ఇలాంటి అలకలు, నిరసనలకు దిగొచ్చే ప్రభుత్వమని పయ్యావుల ఎలా అనుకున్నాడో మరి.