కథ..కథ..కథ కావాలి సీనియర్ హీరో వెంకటేష్ కు. నిర్మాతలు చాలా మంది వున్నారు. వెంకట్ బోయనపల్లి, నాగవంశీ, జ్ఙాన్ వేల్ రాజా ఇలా జాబితా చాలా పెద్దది వుంది. చుట్టూ తిరుగుతున్న డైరక్టర్లు కూడా వున్నారు.
హిట్ 2 డైరక్టర్ శైలేష్, శ్యామ్ సింగ రాయ్ డైరక్టర్ రాహుల్, బంగార్రాజు కళ్యాణ్ కృష్ణ ఇలా చాలా మందే ఆశగా వున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు అయితే వెంకటేష్ కు కథ చెప్పలేదు. ఒక్క సంపత్ నంది మాత్రమే కథ చెప్పారు. అది ఇంకా ఏమైంది అన్నది తెలియలేదు. మిగిలిన వారెవ్వరూ కథ చెప్పలేదు.
నిర్మాతతో సంబంధం లేదని, డైరక్టర్ తో లింక్ లేదని, ఎవరు తనకు సూటయ్యే సరైన కథ చెబితే వారితోనే సినిమా అని ఫిక్స్ అయి కూర్చున్నారు వెంకటేష్. అక్కడ కథ ఓకె అవ్వాలంటే చాలా అంచెలు దాటాలి. సురేష్ బాబు వినాలి. వెంకటేష్ వినాలి. అందరికీ నచ్చాలి. ఇలా చాలా వ్యవహారాలు వున్నాయి. అన్నింటికి ఇప్పుడు ఏ తరహా సినిమా చేయాలి అన్న క్లారిటీ లేదు. కథలు వింటూ వుంటే అదే తెలుస్తుందనే ఆలోచనలో వెంకటేష్ వున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి విదేశాల్లో వున్న వెంకీ తిరిగి రావాలి. కథలు వినాలి. అవి ఫైనల్ కావాలి. అప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏమిటన్నది తేలుతుంది. అంతవరకు అంతా అబేయన్స్ లోనే అన్నది సురేష్ మూవీస్ వర్గాల బోగట్టా.