ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరచూ ఓ మాట చెబుతుంటారు. సంక్షేమ పథకాల అమల్లో పార్టీలు, రాజకీయాలు, కులమతాలు తదితరాలేవీ చూడమని గొప్పగా ప్రకటిస్తుంటారు. సంక్షేమ పథకాల లబ్ధికి అర్హత ఒక్కటే కొలమానం అని ఆయన చెప్పడం తెలిసిందే. సచివాలయ వ్యవస్థ పుణ్యమా అని ఆయన చెబుతున్నట్టే… రాజకీయాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రయోజనం కలిగిస్తున్నారు.
ఇంత వరకూ ఓకే. అయితే వైసీపీ అధికారంలోకి రాకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ఒక ఉద్యోగి టీడీపీ తరపున ప్రచారం చేసిన వ్యక్తి కోసం ఇవాళ్టి ఏపీ కేబినెట్ భేటీ వేదిక కావడం సర్వత్రా విమర్శల పాలవుతోంది. టీటీడీలో చీఫ్ పీఆర్వో పోస్టు భర్తీకి ఏపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇదంతా టీటీడీ పీఆర్వో రవి కోసం ప్రభుత్వం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
వైసీపీ ప్రభుత్వమే రాకూడదని ప్రచారం చేసిన టీటీడీ పీఆర్వో రవికి ప్రమోషన్ కోసం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంపై టీటీడీ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. 2019, ఏప్రిల్ 10న సాక్షి దినపత్రిక మెయిన్ పేజీలో “టీడీపీ ప్రచారంలో టీటీడీ అధికారి ” శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. పలమనేరు ప్రచారంలో టీటీడీ పీఆర్వో పాల్గొన్నారంటూ ఫొటోతో సహా వార్తను సాక్షి పత్రిక ప్రచురించింది. ఆ కథనంలో ఏముందంటే…
“పలమనేరు నియోజక వర్గం తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని మండిపేట కోటూరు ఎస్సీ కాలనీలో అదే గ్రామానికి చెందిన ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంటి వద్ద మంత్రి అమరనాథ్‌రెడ్డి యూత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పీఆర్వో రవి కీలకంగా వ్యవహరించారు. టీడీపీ నేతలతో కలిసి అతను కూర్చొని వున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చర్చి ఫాదర్‌తో పాటు టీటీడీ పీఆర్వో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశమైంది”
ఈ రవి కోసం ఏపీ కేబినెట్ కొత్తగా చీఫ్ పీఆర్వో పోస్టును క్రియేట్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో? అని పలమనేరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ పీఆర్వో హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా టీడీపీ గెలుపు కోసం పని చేశాడంటే… ఆ పార్టీపై ఎంత గాఢమైన అభిమానాన్ని పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చని పలమనేరు వైసీపీ కార్యకర్తలు, నేతలు అంటున్నారు. ఎంతైనా తమ జగన్ …పెద్ద తోపు అని, తన పార్టీ ఓటమి కోసం పని చేసిన అధికారి కోసం కొత్త పోస్టును కూడా క్రియేట్ చేసేంత ఉదాత్తవాది అని సెటైర్ విసురుతున్నారు.