పర్సనాలిటీ ఎలా ఉన్నా కొడుకులను హీరోలుగా జనం మీద రుద్దుతూవచ్చారు స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు. జనాలు కూడా క్రమక్రమంగా వారికి అలవాటు పడక తప్పని పరిస్థితులున్నాయి. హీరోలే కాదు.. రోజులు మారి ఆఖరికి హీరోయిన్లను కూడా జనాలు తప్పనిసరిగా భరించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి!
దశాబ్దం కిందటి వరకూ సినీవారసులు హీరోలుగా మాత్రమే అవతారం ఎత్తుతూ వచ్చారు. గత ఇరవై యేళ్లలో సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీల నుంచి కాకుండా బయటి నుంచి వచ్చి నిలదొక్కుకున్న హీరోలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అదే జనాల ఖర్మ అనుకుంటే, హీరోయిన్లను చూసైనా కాస్త ఊపిరి పీల్చుకోనిచ్చేలా లేరు సినీ వారసురాళ్లు!
ఇప్పటికే బాలీవుడ్ లో ఎటు చూసినా హీరోయిన్లంతా సినీవారసత్వంతో వచ్చిన వాళ్లే. గ్లామర్ , డీ గ్లామర్ తేడా లేకుండా.. బయటి వాళ్లకు ఏ అవకాశం లేదన్నట్టుగా సినీవారసురాళ్లు దున్నేస్తున్నారు హిందీ చిత్రసీమలో. నటన రాకపోయినా, అందం కూడా అంతంతమాత్రమే అయినా.. ఆహా..ఓహో.. అంటూ వారినే నెత్తికెత్తుకుంటోంది మీడియా. క్రమంగా జనాలు కూడా.. అందం అంటే ఇలానే ఉంటుంది, నటన అంటే ఇంతే! అనుకుంటూ రాజీ పడిపోయారు!
ఇలాంటి పరంపరలో మరో వారసురాలు గ్లామర్ పాట్లను పడుతోంది. ఈమె..శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. చిన్నప్పటి శ్రీదేవి కూతుళ్లను చూసిన వారెవరూ వారిలో హీరోయిన్ మెటీరియల్ ఉందని భావించి ఉండరు. ఎవరేమనుకున్నా.. శ్రీదేవి పెద్ద కూతురు ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇప్పుడు ఖుషీ కపూర్ వంతు వచ్చింది. దీని కోసం ఆమె సోషల్ మీడియా ను తెగ ఉపయోగించుకుంటూ ఉంది. అక్కడ గ్లామరస్ పోజులను ఇస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒకటీ రెండు సినిమాల్లో ఖుషీ నటిస్తోంది. ఇప్పుడు ఈమె పోజులు ఇంటర్నెట్ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. వీటిని ప్రమోట్ చేసే బాధ్యతను జాన్వీ కపూర్ కూడా తీసుకుంది. ఖుషీ కపూర్ యమ హాట్ అని నిరూపించే ప్రయత్నం ఇలా గట్టిగానే జరుగుతోంది!