ప్రియాంక బాగుచేయగలదా..?

తెలంగాణా కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలిచే పరిస్థితి కనబడటంలేదు. ఉప ఎన్నికల్లో పార్టీ పోరాడటం కంటే పార్టీలో నాయకుల పోరాటం ఎక్కువగా ఉంది. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం…

తెలంగాణా కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలిచే పరిస్థితి కనబడటంలేదు. ఉప ఎన్నికల్లో పార్టీ పోరాడటం కంటే పార్టీలో నాయకుల పోరాటం ఎక్కువగా ఉంది. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం కష్టమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అదే కనుక జరిగితే రేవంత్ రెడ్డికి ఉద్వాసన చెప్పడం ఖాయంలా కనబడుతోంది. 

సీనియర్లలో చాలామంది రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీ గెలుపుకోసం వీళ్ళు ఎంతవరకు పనిచేస్తారో చెప్పలేం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ వ్యతిరేకులు చాలామంది బయటపడి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. చివరకు పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాకూర్ ను కూడా లెక్క చేయడంలేదు. రేవంత్ ను ఇంటికి పంపాలని కొందరు నాయకులు గట్టి పట్టుదలగా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పదవులు పోగొట్టుకోవడం చాలా సాధారణ విషయం. రేవంత్ రెడ్డి కూడా అందుకు అతీతుడేమీ కాదు. మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఓ దశలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఆయన ఇప్పటికీ పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉన్నారు. 

పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలని సీనియర్ నాయకుడు వీహెచ్ అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన చెందుతున్నాడని,  దాన్ని అధిష్టానం సరిదిద్దాలని సూచించారు. అయితే.. నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారన్న హనుమంతరావు.. హైకమాండ్ ఆలోచన  చేయాలన్నారు. సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇస్తే  అక్కడ మాట్లాడ వచ్చని, మీటింగులు పెట్టకపోతే బయట మాట్లాడతారన్నారు. మునుగోడు లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిదని హనుమంతరావు హితవు పలికారు. 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోనియా గాంధీ కలవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరించడంతో పాటు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానక పరిస్థితుల గురించి తెలియజేయడం కోసం సోనియా వద్దకు వెళ్తున్నానని, అందుకే ఆమె అపాయింట్‌మెంట్ కోరానని అన్నారు. 

ఇదే సమయంలో.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. అందుకు ఒక కండీషన్ పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగిస్తేనే, ప్రచానికి వస్తానని ఆయన అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎదురుగా మునుగోడు టార్గెట్ ఉన్నప్పటికీ నేతల మారడంలేదు.

తమకు దక్కాల్సిన పదవిని రేవంత్ రెడ్డి తన్నుకుపోయాడని చాలామంది నాయకులకు కోపంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్ళిపోయాక వారంతా కసి తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే …. పార్టీకి ఉన్న కీలక ఆయుధాల్లో ప్రియాంకా గాంధీ ఒకరు. ఆమెను యూపీ ఎన్నికల్లో రంగంలోకి దించినా ఆశించిన ఫలితాలు రాలేదు. 400 అసెంబ్లీ సీట్లుండగా కాంగ్రెస్ రెండు చోట్లే గెలిచింది. 

యూపీ ఎన్నికల్లో ఆమె ప్రభావం చూపించలేదు. అలాంటి ప్రియాంకకు తెలంగాణా బాధ్యతలు అప్పగిస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగినా తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్లో మార్పు వస్తుందని ఆశించలేం. ఆమె బాధ్యతలు తీసుకున్నా  పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కష్టమే.