ఓట్ల కోసమేనా ఈ డిమాండ్?

ఎన్నికలొస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు వివిధ సామాజిక వర్గాల ఓట్ల కోసం నానా తిప్పలు పడుతుంటాయి. ఇలా ఓట్ల కోసం పాకులాడే పార్టీల్లో అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు కూడా ఉంటాయి. అధికార పార్టీని ఇరుకున…

ఎన్నికలొస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు వివిధ సామాజిక వర్గాల ఓట్ల కోసం నానా తిప్పలు పడుతుంటాయి. ఇలా ఓట్ల కోసం పాకులాడే పార్టీల్లో అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు కూడా ఉంటాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి అపోజిషన్ పార్టీలు  ప్రయత్నిస్తుంటాయి.  అలాంటి ప్రయత్నమే తెలంగాణలో బీజేపీ చేస్తోంది. ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్నది కదా. 

తొందరలో మునుగోడు ఉప ఎన్నిక జరగబోతోంది. ఒక సామాజిక వర్గం ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నంతో కేసీఆర్ ను ఇరుకున పెడుతోంది. కేసీఆర్ కనుక ఆ డిమాండ్ నెరవేరిస్తే ఆ క్రెడిట్ తమదేనని ప్రచారం చేసుకోవచ్చు. బీజేపీకి ఈ ఆలోచన దశాబ్దాలుగా రాకుండా ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే కారణం అధికారం సాధించాలనే కొరికే. 

ఇంతకూ అసలు విషయం ఏమిటంటే ….జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ పార్టీ కూడా ఈ డిమాండ్ చేయలేదు. సరే …ఇంతకూ ఈ సర్వాయి పాపన్న ఎవరంటే గౌడ సామాజిక వర్గానికి చెందిన పోరాట యోధుడు. ముస్లిం రాజులతో పోరాడిన వీరుడు. తెలంగాణలో సర్వాయి పాపన్న పేరు చాలా ప్రసిద్ధి. తెలంగాణలో ఈయనది చాలా పెద్ద సామాజిక వర్గం.  

పోరాటయోధుడు, విప్లవనాయకుడు సర్వాయి పాపన్నకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌ ఈ ఆరోపణ చేశారు. పాపన్న 372వ జయంతి వేడుకల్లో పాల్గొన్న లక్ష్మణ్ అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్నగౌడ్ పేరును ఆయన పుట్టిన జిల్లా జనగామకు పెట్టాలని జిల్లా పేరును మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతే కాదు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడి పదవిలో ఉంటూ రాజ్యసభకు ఎన్నికైన కే,. లక్ష్మణ్‌కు పార్టీ అధిష్టానం ఇటీవలే మరో పెద్ద పదవిని కట్టబెట్టింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్‌తో పాటు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించింది. దీంతో ఆయన దూకుడు పెంచారు. అందులో భాగంగానే ఈ డిమాండ్ చేశారు. 

ఇదే అంశాన్ని కోన్ని రోజుల క్రితం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో గౌజ జన హక్కుల పోరాట సమితి నేతలు సైతం డిమాండ్ చేశారు. పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నపేరును జిల్లాకు పెట్టి ఆయన కట్టిన కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గౌడకుల సంఘాల నేతలు. 

పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. పాపన్న జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా కల్లు గీత కార్మికులందరికి సొసైటీలో గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియాను విడుదల చేయాలన్నారు. గీత కార్మికులకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలని ఫించన్‌ను కూడా ఐదు వేలకు పెంచాలని కోరారు. పించన్‌ను ఐదు వేలకు పెంచాలని కోరారు. 

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని కొనియాడిన సీఎం కేసీఆర్‌ ఆయన పేరును జిల్లాకు పెట్టాలన్న డిమాండ్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని చెప్పిన సీఎం..జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరును పెడతార లేదా అనే సందేహాలు రాజకీయంగా కొత్త చర్చకు దాకి తీశాయి.