తెలుగువారికి సుపరిచితుడే అయినా ధనుష్ తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదం విషయంలో ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేకపోతున్నాయి. త్వరలోనే ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి కూడా! ఇలాంటి నేఫథ్యంలో అతడి తమిళ సినిమాను ముందస్తుగా ఇక్కడ సరిగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎందుకో.. ధనుష్ తాజా తమిళ సినిమా తెలుగు అనువాదానికి సరైన పబ్లిసిటీ లేకుండా పోయింది.
ఈ సినిమా ట్రైలర్ లో తెలుగువారికి తెలిసిన నటులే ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు. నిత్యామేనన్, రాశీ ఖన్నా, ప్రకాష్ రాజ్.. వీరు చాలరా? తమిళ సీనియర్ దర్శకుడు భారతిరాజా కూడా ఒక ముఖ్యపాత్రను పోషించినట్టుగా ఉన్నాడు.
వీఐపీ తరహాలో .. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిదాయకంగానే ఉంది. తెలుగులోకి అనువాదం మాత్రం అంత క్వాలిటీ లేదు. ప్రకాష్ రాజ్, నిత్యామేనన్ ల సీన్లలో డైలాగులను వారి స్వరాల్లో కాకుండా వేరే వారి డబ్బింగ్ తో వినడానికి మించిన కష్టం ఏముంటుంది? ఈ సినిమా విషయంలో అదే జరిగింది. వారికి వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు.
ఇక తమిళంలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నట్టుంది. తొలి రోజు సుమారు పది కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట ఈ సినిమా. రజనీకాంత్ కు మాజీ అల్లుడు అయినప్పటికీ.. విడాకుల వ్యవహారం ధనుష్ సినిమా వసూళ్లపై ఏమీ పడలేదని ఇలా స్పష్టత వస్తోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళనాట ఇలా ఆకట్టుకుంటున్నప్పటికీ.. తెలుగునాట మాత్రం ఏ మాత్రం సందడి చేయడం లేదు.
బహుశా ఓటీటీ, టీవీ విడుదలల్లో ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందేమో! ఈ సినిమా దర్శకుడు మిత్రన్ ఇది వరకూ ధనుష్ తో మూడు సినిమాలను రూపొందించాడు. ఆ మూడూ తెలుగు సినిమా రీమేక్ లే. ఆర్య, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే, రెడీ వంటి సినిమాల తమిళ రీమేక్ లలో ధనుష్ నటించగా.. వాటికి మిత్రన్ దర్శకత్వం వహించాడు. వీరి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. తొలి స్ట్రైట్ సినిమా.