బాలీవుడ్ భామ కియరా అద్వానీకి ఇప్పుడు మంచి టైమ్ నడుస్తోంది. మొదట్లో అవకాశాలను సంపాదించుకునేందుకు ఈ భామ కష్టపడింది. ఒకటీ రెండు సినిమాలు విడుదల అయ్యాకా కూడా విరామాలతో మాత్రమే అవకాశాలు లభించాయి. అయితే 'భరత్ అనే నేను'లో నటించిన తర్వాత కియారా అద్వానీ దశ తిరిగింది.
ఆ సినిమా తర్వాత తెలుగులోనే మరో పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఒక వెబ్ సీరిస్ లో కియరా బోల్డ్ యాక్టింగ్ తో సంచలనం రేపింది. అంతలోనే 'కబీర్ సింగ్' అవకాశం దక్కింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగే దిశగా సాగుతోంది కియరా. ఇక సౌత్ లోనూ ఆమెకు క్రేజ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికిప్పుడు తెలుగు స్టార్ హీరోలు కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు రెడీగానే ఉన్నారు. మరోవైపు ఆమెపై తమిళ హీరోలు కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది.
విజయ్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో కియరాను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలో నయనతారతో జతకట్టాడు విజయ్. నెక్ట్స్ సినిమాలో కియరాను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ మేరకు సంప్రదింపులు సాగుతున్నాయని సమాచారం.