ఏపీలో మీడియా ముచ్చట్లు తగ్గాయి. అధికార పార్టీ మీడియాకు దూరంగానే ఉంటుంది. మంత్రులు కాస్త ఉత్సాహంగానే ఉన్నా.. సీఎం జగన్ మాత్రం మీడియాకు దూరంగానే ఉంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు వరుస ప్రెస్ మీట్లకు అలవాటుపడ్డ మీడియాకు ఇది మింగుడుపడని విషయమే.
చంద్రబాబు హయాంలో ప్రెస్ మీట్లే ప్రెస్ మీట్లు. బాబు ఢిల్లీ వెళ్తుంటే ముందొక ప్రెస్ మీట్, అక్కడ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఒకటి, మోదీని కలిసేముందు, కలిసిన తర్వాత.. ఎడా పెడా మాట్లాడుతూనే ఉండేవారు. ఇక మంత్రివర్గం సంగతి వేరే చెప్పాలా. కేవలం మాటలకే పరిమితమైన మంత్రులు, అధికార ప్రతినిధులు ఎంతమేర నోరు చేసుకోవాలో.. అంతా చేసేవారు.
జగన్ అలా కాదు, మీడియా ముచ్చట్లు బాగా తగ్గించేశారు. నిజానికి ముఖ్యమంత్రి కాకముందు కూడా జగన్ కు ఇలాంటి అలవాటు లేదు. ఆయన మాటల మనిషికాదు, చేతల మనిషి, అందుకే వీలైనంత వరకు ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటున్నారు. పోనీ సోషల్ మీడియాలో అయినా విపరీతమైన యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీలేదు. గతంలో చంద్రబాబుతో పోల్చిచూస్తే అది కూడా తక్కువే.
అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల విధి విధానాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రమే మీడియా ముందుకొచ్చారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎక్కడా సీఎం మీడియా ముందుకురాలేదు. అధికారులతో వరుస సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నా కూడా వాటి వివరాలేవీ అధికారికంగా సీఎం బైటకు వెల్లడించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
అదే సమయంలో చంద్రబాబు తన అలవాటు మానుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో మాట్లాడలేక, అయిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టి గంటలకొద్దీ చెప్పిందే చెబుతూ, అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల చినబాబు లాగే ట్విట్టర్ కే పరిమితమైన చంద్రబాబుకి ఎప్పుడూ పేపర్లో పడాలని, టీవీలో కనిపించాలనే తాపత్రయం ఎక్కువ. ఆ మీడియా పిచ్చే చివరకు బాబు కొంపముంచింది. తనచుట్టూ జరుగుతున్నది అంతా నిజమనే భ్రమలో పడి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు.
సీఎం జగన్ కు మాత్రం మీడియాలో కనిపించాలనే ఆత్రుత లేదు. దీంతో జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో మీడియా ముచ్చట్లు బాగా తగ్గిపోయాయి. చివరికి ఢిల్లీలో పర్యటిస్తున్న సందర్భంగా కూడా జగన్ మీడియా సమావేశం పెట్టాలని అనుకోలేదు. తన పర్యటనను ఓ రోజు పొడిగించుకున్నప్పటికీ ముఖ్యనేతల్ని కలిసేందుకే ఆ సమయాన్ని వెచ్చిస్తున్నారు తప్ప, మీడియాకు అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదు.