ఇప్పటికే పలు యాడ్స్ వివాదాలతో సెలబ్రిటీలకు లీగల్ నోటీసులు అందిన వైనం వార్తల్లో నిలిచింది. ప్రత్యేకించి రియలెస్టేట్ యాడ్స్ విషయంలో కొందరు సెలబ్రిటీలు బుక్ అయ్యారు. వివిధ స్థిరాస్థి వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వారు అవి వివాదాల పాలు కావడంతో లీగల్ నోటీసులు అందుకున్నారు. అయితే వారిపై చట్టపరమైన చర్యలు ఏమీలేవు.
కానీ తాజాగా కన్జూమర్ ఫోరం ఒక ఆసక్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అసంబంద్ధమైన యాడ్స్ చేసే సెలబ్రిటీలు ఈ విషయంలో దృష్టి సారించాల్సి ఉంటుంది. జనాలను మిస్ లీడ్ చేసేలా యాడ్స్ ఉంటే చర్యలు తప్పవని ఫోరం పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ చేసినందుకు సదరు సెలబ్రిటీలపై భారీ ఫైన్ కూడా పడుతుందని వివరించింది.
కనిష్టంగా పదిలక్షల రూపాయల నుంచి గరిష్టంగా యాభైలక్షల వరకూ సెలబ్రిటీల మీద ఫైన్ పడే అవకాశాలున్నాయని కన్జూమర్ ఫోరం ప్రకటించింది. అంటే ఇక నుంచి తాము ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ల నాణ్యతకూ, వాటి మన్నికకూ సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫలానా కూల్ డ్రింక్ తాగితే ఏదైనా చేయొచ్చు, ఫలానా సెంట్ కొట్టుకుంటే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు.. అనే రకంగానే చాలా యాడ్స్ ఉంటున్నాయి. వాటికి సెలబ్రిటీలే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. మరి అలాంటి వాటి విషయంలో ఔత్సాహికులు ఎవరైనా వాళ్లు చెప్పింది జరగలేందటూ కన్జూమర్ ఫోరంను ఆశ్రయిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటో!