కొమురం భీమ్.. గోండు జాతి యోధుడు. ఆషాఫ్ జాహీ వంశీకుల పై పోరాడిన వ్యక్తి. ఆయన స్ఫూర్తి ఒక చరిత్ర. కొమురం భీమ్ పై అభిమానమో మరేమో కానీ.. టాలీవుడ్ ఆయన ఘనతను సినిమాల్లో వాడుకోవడం అప్పుడప్పుడు జరుగుతున్నదే.
ఒకవేళ కొమురం భీమ్ చరిత్రను గొప్ప సినిమాగా తెరకెక్కిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే ఆయన పేరును తమ కథలకు అనుగుణంగా వాడుకోవడాన్ని ఆయన వారసులు, ఆయన అభిమానులు ఆక్షేపిస్తూ ఉంటారు.
దాదాపు పదేళ్ల కిందట.. కొమురం భీమ్ పేరును సినిమాలో ఉపయోగించుకోవడం పట్ల ఒక వివాదం రేగింది. అది పవన్ కల్యాణ్ సినిమా పేరు విషయంలో. ఎస్జే సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'పులి' సినిమాకు ముందుగా పెట్టిన పేరు కొమరం పులి.
ఆ సినిమా ను ఆ పేరుతోనే ప్రచారం చేశారు. కొమురం భీమ్ ఇంటి పేరును కొమరం గా మార్చేసి కొమరం పులి అని టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఆడియో విడుదల వరకూ ఆ సినిమా పేరు కొమరం పులి అనే పెట్టారు.
అయితే కథతో సంబంధం లేకుండా తమ యోధుడి ఇంటి పేరును వాడుకోవడం పట్ల కొమురం కుటుంబీకులు, భీమ్ అభిమానులు అభ్యంతరం చెప్పారు. ఆ సినిమాను బహిష్కరిస్తామని తెలంగాణ జేఏసీ అప్పట్లో హెచ్చరించింది.
కొమురం భీమ్ వంశీకుల అభ్యంతరంతో చివరకు ఆ సినిమా టైటిల్ ను మార్చారు. కొమరం తొలగించి పులి గా విడుదల చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది, అది వేరే కథ. కట్ చేస్తే.. పదేళ్ల తర్వాత మళ్లీ కొమురం భీమ్ పేరును ఒక పెద్ద సినిమా విషయంలో ప్రస్తావిస్తున్నారు.
చరిత్రలోని యోధుల పేర్లు వాడుకుంటూ.. కల్పిత కథను తెరకెక్కిస్తున్నట్టుగా ఉన్నారు. ఇది మిస్ ఫైర్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. ఇప్పటికే కొమురం భీమ్ అభిమాన వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇది ఇంకా ఎంత వరకూ వెళ్తుందో!