గీతం వర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన భవన నిర్మాణాల కూల్చివేత సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది. ఎందుకుంటే గీతం వర్సిటీ రాజకీయ పునాదులపై నిర్మితమైంది. దివంగత టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఈ వర్సిటీని నెలకొల్పారు. కొన్ని నెలల క్రితం విదేశాల్లో ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ప్రస్తుతం ఆ వర్సిటీ చైర్మన్‌గా శ్రీభరత్ వ్యవహరిస్తున్నారు. ఈయన చంద్రబాబు బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా కావాల్సిన వ్యక్తులకు సంబంధించి విశ్వవిద్యాలయం ఇది అని అర్థం చేసుకోవచ్చు.
రుషికొండ, ఎండాడ గ్రామాల్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఏఏ సర్వే నంబర్లలో ఎంతెంత భూమి గీతం ఆక్రమించిందో రెవెన్యూ అధికారులు లెక్కలేసి మరీ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి గీతంలోని పలు అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు దగ్గరుండి కూల్చేశారు. ఈ ఆపరేషన్ శనివారం ఉదయం 11 గంటల వరకూ కొనసాగింది. ఆక్రమణలు తొలగించిన ప్రాంతంలో ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టడం గమనార్హం.
అయితే ఆక్రమణల తొలగింపుపై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు హడావుడి తప్ప , ఈ వర్సిటీకి సంబంధించి చైర్మన్ శ్రీభరత్ లేదా ఇతర యాజమాన్య సభ్యులు ఇంత వరకూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గీతంలో ఆక్రమణల తొలగింపుపై ఈనాడు పత్రికలో అర్ధరాత్రి ధ్వంసం శీర్షికతో కథనాన్ని ప్రచురించారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే …అర్ధరాత్రా? మిట్టమధ్యాహ్నమా ? అనే సమయాలు కాదు , అవి ఆక్రమణలా, కాదా? అనేదే ప్రధానం. అయితే ఎల్లో మీడియా నిన్నటి నుంచి ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నా …గీతం వర్సిటీ చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై నేతల స్పందన గురించి తెలుసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్, టీడీపీ నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణబాబు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. చంద్రబాబు తానా అంటే సీపీఐ తందానా అంటుందనే విషయం అందరికీ తెలిసిందే.
నిజంగా తమ వర్సిటీ సొంత స్థంలోనే ఉంటే చైర్మన్‌గా భరత్ ఎందుకు నోరు మెదపడం లేదనేది ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. కేవలం వర్సిటీ పీఆర్‌వో నరసింహం పేరుతో ఆక్రమణల తొలగింపుపై ప్రకటన ఇప్పించడం ఏంటని విద్యావేత్తలు అడుగుతున్నారు. అతనొక ఉద్యోగి మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. గీతం వర్సిటీ యాజమాన్యం మౌనం పాటించడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న వాదనకు బలం కలుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్డీఓ పెంచలకిశోర్ వివరణ, గీతం పీఆర్‌వో నరసింహం ప్రకటనలను ఒకసారి పోల్చి చూద్దాం.
‘సర్వేయర్ల నివేదిక ప్రకారం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో 40.51 ఎకరాల భూమి గీతం ఆధీనంలో ఉంది. ఎండాడ రెవెన్యూ సర్వే నంబర్లు 15, 16, 17, 18, 19, 20 పార్ట్‌లలో 22.21 ఎకరాలు, రుషికొండ సర్వే నంబర్లు 34, 35, 37, 38, 55, 61 పార్టులలో 18.3 ఎకరాలు ఉంది.
ఆ భూముల్లో గీతం ప్రహరీ, విశ్వవిద్యాలయం గార్డెన్, క్రీడా మైదానం ఉన్నాయి. సుమారుగా ఎకరా నుంచి రెండు ఎకరాలలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు’ అని ఆర్‌డీవో పెంచల కిశోర్ వివరించారు.
‘ మాకు ఎలాంటి నోటీసు లేకుండా, గీతం ఉన్నతాధికారులు నగరంలో లేని సమయంలో…ఇలా చీకట్లో వచ్చి కూల్చివేయడం అన్యాయం. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. కొవిడ్‌లో వేలాది మందికి చికిత్స చేసిన ఘనత గీతంకు ఉంది.
మూడు వేల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాం. హుద్‌హుద్ సమయంలో ఇక్కడే షెల్డర్ ఇచ్చి మూడు రోజులు అందరికీ భోజనాలు పెట్టాం. విశాఖపట్నం అంటే గీతం…గీతం అంటే విశాఖపట్నం అనే పేరు ఉంది. ఇలా చేసి ఉండకూడదు’’ అని పీఆర్‌వో నరసింహం పేర్కొన్నారు.
ఆర్డీవో ప్రస్తావించిన ఆక్రమణలకు సంబంధించి పీఆర్వో నుంచి సమాధానం లేదు. పొంతనలేని మాటలన్నీ ఆయన చెప్పిం దాంట్లో ఉన్నాయి. తమ వర్సిటీ ప్రభుత్వ భూముల్లో లేదని నిరూపించే ఆధారాలేవీ వాళ్ల దగ్గర లేవు. అందుకే గీతం వర్సిటీ యజమానులెవరూ మీడియా ముందుకొచ్చే ధైర్యం చేయలేదు.
కానీ కూల్చివేతల అభాండాలను జగన్ సర్కార్‌పై వేయడం వల్ల తమ అక్రమాలను కప్పి పుచ్చుకోవడంతో పాటు కాపాడుకోవాలనే కుట్ర కోణం టీడీపీ నేతల్లో కనిపిస్తోందనే వాదన బలపడు తోంది. అదే నిజం కాకపోతే ఆక్రమణల తొలగింపుపై అసలు బాధితులైన గీతం వాళ్లకు లేని ఆందోళన , టీడీపీ నేతలకు ఎందుకనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.