బన్నీ, మహేష్ తమ సినిమాల ప్రచారాన్ని ఇంకా తగ్గించలేదు. ఓవైపు తమ సినిమా ఆల్ టైమ్ హిట్ అంటూ అల వైకుంఠపురములో యూనిట్ థ్యాంక్స్ మీట్ పెడితే.. సరిలేరు నీకెవ్వరు యూనిట్ తమ ఆఖరి అస్త్రంగా కృష్ణను రంగంలోకి దించింది. కొడుకు మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు కృష్ణ రివ్యూ ఇచ్చారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్టవ్వడానికి తనదైన విశ్లేషణ ఇచ్చారు కృష్ణ. సినిమా రిలీజైన 3 వారాలకు బయటకొచ్చిన కృష్ణ.. సినిమా సక్సెస్ అవ్వడానికి కారణలు వెల్లడించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఎంటర్ టైనింగ్ గా సాగిన సినిమా, ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి క్లయిమాక్స్ వరకు ఎక్కడా గ్రాఫ్ తగ్గకుండా వెళ్లిందని, అందుకే సినిమా సూపర్ హిట్టయిందని న్నారు.
ఈ సినిమాలో కృష్ణ కూడా కనిపిస్తారు. నేరుగా కాకుండా ఆయన నటించిన అల్లూరి సీతారామరాజులోకి క్లిప్స్ వాడుకున్నారు. సినిమాకు వాటిని సింక్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మహేష్ పై అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ను కూడా సింక్ చేశారు. దీనిపై స్పందించిన కృష్ణ.. కథలో అది కరెక్ట్ గా కుదిరిందన్నారు. అందుకే ఆడియన్స్ కు కనెక్ట్ అయిందని అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా సంగతులతో పాటు తను హీరోగా, మహేష్ బాలనటుడిగా చేసినప్పటి మెమొరీస్ ను గుర్తుచేసుకున్నారు. మహేష్ కు తెలుగు చదవడం రాదని, అసిస్టెంట్ డైరక్టర్ చెప్పిన డైలాగ్స్ ను గుర్తుపెట్టుకొని అద్భుతంగా చెప్పేవాడని అన్నారు. మహేష్ ను బోర్న్ ఆర్టిస్టుగా అభివర్ణించిన కృష్ణ.. సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన వెంటనే మహేష్ కు ఫోన్ చేసి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్పానన్నారు.