ఎల్ఐసీ వాటాల అమ్మకం నిస్సందేహంగా బంగారు బాతు కథను గుర్తు చేస్తూ ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. బంగారుబాతు కథ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు కడుపులో ఎన్నో బంగారు గుడ్లు ఉంటాయని ఒకడు దాన్ని కోసి మూర్ఖుడు అవుతాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీరు కూడా అలానే ఉందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను లాభసాటిగా నిలపడంలో ఫెయిల్ అవుతున్న ప్రభుత్వాలు.. ఇదే సమయంలో లాభాల్లో ఉన్న వాటిని అమ్ముకుతినే పని చేస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు.
ఎల్ఐసీ ప్రతియేటా కేంద్రానికి డివిడెంట్ కట్టే సంస్థ. అది మాత్రమే కాదు.. ఎల్ఐసీని ప్రభుత్వం రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉంది. నష్టాల్లో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి కూడా ఎల్ఐసీని ఉపయోగించుకుంటూ ఉన్నారు. డిజెన్విస్ట్మెంట్ లో భాగంగా అనమాట. ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను ఎల్ఐసీ చేత కొనిపించడం. ఎలాగూ ఎల్ఐసీ దగ్గర డబ్బులున్నాయి. కాబట్టి దాని చేత నష్టాల్లో ఉన్న సంస్థల్లో వాటాలు కొనిపించడం చేస్తూ వచ్చారు ఇన్నేళ్లూ. అలా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల పాలిట ఎల్ఐసీ ఒక బంగారు బాతులా పని చేసింది.
ప్రభుత్వానికి డివిడెంటూ కడుతూ, మరోవైపు అవసరమైన సందర్భాల్లో అలా ఆర్థికంగా ఉపయోగపడుతూ.. అన్నింటికీ మించి పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా ఎల్ఐసీ ప్రజల నమ్మకాన్ని కలిగి ఉండింది. ఇప్పుడు అలాంటి సంస్థను ప్రైవేటీకరించడం నిస్సందేహంగా బంగారు బాతును కోసుకుతినడమే అని నిపుణులు అంటున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు కూడా ఈ విషయంలో నిరసన తెలుపుతున్నాయి. ఇదీ మోడీ సర్కారు ఎల్ఐసీతో వ్యవహరిస్తున్న తీరు.