నటుడు కృష్ణంరాజు తన భోజన అలవాట్ల గురించి చర్చించుకోవడానికి బాగా ఆసక్తి చూపే వారు కూడా. సినిమా పరిశ్రమలో ఒక్కోరికి ఒక్కోరకమైన పేరు, ఇమేజ్ ఉంటుంది వ్యక్తిగతంగా. మిగతా వాళ్ల విషయాలు పక్కన పెడితే.. కృష్ణంరాజు ఆతిథ్యానికి మంచి పేరుంది. అలాగే తన భోజనం విషయంలో కూడా కృష్ణంరాజు రాజీపడటమో, తిండి విషయంలో నియమాలు పెట్టుకోవడమో చేసే వారు కాదనే పేరుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు పలు ఇంటర్వ్యూల్లో.
కృష్ణంరాజుతో ఇంటర్వ్యూ అంటే.. భోజనం ప్రస్తావనను మీడియా ప్రతినిధులు కూడా తీసుకురావడం తప్పనిసరిగా జరిగిన దాఖలాలున్నాయి. ఈ అంశం గురించి గతంలో ఒక ఇంటర్వ్యూల్లో డీటెయిల్డ్ గా చర్చించారు. ఒకసారి సాక్షికి కృష్ణంరాజు దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూలో భోజనం అంశం గురించి ప్రత్యేకంగా ఉంటుంది.
ఎలాంటి భోజనం తనకు బాగా ఇష్టమో కృష్ణంరాజు వివరించారు. ఆయన ఛాయిస్ సహజంగానే నాన్ వెజ్ వైపు ఉంటుంది. ఇంట్లోనే వేటను కోయించుకుని తినడాన్ని ఆయన బాగా ఉత్సాహపడే వారని ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది.
అన్నింటికీ మించి.. కృష్ణంరాజు చెప్పిన ఒక విషయం పాఠకుల్లో బాగా రిజిస్టర్ అవుతుంది. అదే తను రెండు జన్మలకు సరిపడినంత తిన్నానని ఆయన స్వయంగా చెప్పడం. రకరకాల రుచులను ఆస్వాధించడాన్ని తన జీవనశైలిలో భాగంగా చేసుకున్నారు కృష్ణంరాజు. ఈ విషయాన్ని ఒకే మాటలో చెబుతూ.. ఇదే జన్మలో తను రెండు జన్మలకు సరిపడినంత తిన్నట్టుగా ఆయన చెప్పారు.
కృష్ణంరాజు జీవనశైలిని బట్టి చూస్తే.. తినడానికి ఎవరైనా భయపడుతుంటే ఆ భయం పెట్టుకోనక్కర్లేదని కూడా స్పష్టం అవుతుంది. ఆయన 80 యేళ్లకు పైగా బతికారు. అది కూడా తను తినాలని అనుకున్నది తింటూ! తిండి విషయంలో ఎక్కడా రాజీ లేకుండా, తినాలని అనిపించినదంతా తింటూ.. స్వేచ్ఛగా వ్యవహరించారు. 80 యేళ్ల వయసు పైనే అంటే అది సంపూర్ణ జీవితాన్ని చూసి వెళ్లడమే! భోజనం విషయంలో 40 తర్వాత కట్టేసుకోవాలి, నాన్ వెజ్ తినకూడదు.. అనేవన్నీ ఉత్తుత్తి కబుర్లే అనిపిస్తుంది కృష్ణంరాజు తన భోజనపు అలవాట్లను వివరించి చెప్పిన తర్వాత!