సెల‌వు …క‌ట‌క‌టాల రుద్ర‌య్యా!

1978, అక్టోబ‌ర్ 11, ఉద‌యం 10 గంట‌లు. అనంత‌పురం, నీలం టాకీస్‌. క‌ట‌క‌టాల రుద్ర‌య్య సినిమా రిలీజ్‌. అప్ప‌టికి కృష్ణంరాజు సినిమాల‌కి ఉద‌యం 8 గంట‌ల ఆట వేసేంత డిమాండ్ లేదు. ANR, NTR,…

1978, అక్టోబ‌ర్ 11, ఉద‌యం 10 గంట‌లు. అనంత‌పురం, నీలం టాకీస్‌. క‌ట‌క‌టాల రుద్ర‌య్య సినిమా రిలీజ్‌. అప్ప‌టికి కృష్ణంరాజు సినిమాల‌కి ఉద‌యం 8 గంట‌ల ఆట వేసేంత డిమాండ్ లేదు. ANR, NTR, కృష్ణ సినిమాలే అనంతపురంలో ఐదు ఆట‌ల‌తో విడుద‌ల‌య్యేవి. శోభ‌న్‌కి కూడా ఆ క్రేజ్ లేదు.

టికెట్లు సుల‌భంగానే దొరికాయి. థియేట‌ర్ హౌస్‌ఫుల్ కావ‌డానికి కార‌ణం దాస‌రి నారాయ‌ణ‌రావు. అప్ప‌టికే స్టార్ డం ఉన్న డైరెక్ట‌ర్‌. క‌ట‌క‌టాల రుద్ర‌య్య‌పైన పెద్ద‌గా అంచ‌నాలు కూడా లేవు. సినిమా స్టార్ట్ అయిన కాసేప‌టికే అర్థ‌మైంది. కృష్ణంరాజు సినిమా మామూలుగా లేద‌ని. క‌ర్ణుడు -కుంతి క‌థే అయినా డైలాగ్‌లు ఒక రేంజ్‌లో వున్నాయి. అనాథ‌గా పెరిగాన‌న్న ఆవేద‌న, బాధ‌, ఆగ్ర‌హం కృష్ణంరాజులో క‌నిపించాయి (ఇదే క‌థ‌ని మ‌ణిర‌త్నం కొంచెం ప‌రిధి పెంచి ద‌ళ‌ప‌తి చేసాడు).

ఒక్క‌రోజులో టాక్ పెరిగి పోయింది. కృష్ణంరాజు రెబ‌ల్ స్టార్ అయ్యాడు. త‌ర్వాత వ‌చ్చిన రంగూన్ రౌడీ (ముక‌ద్ద‌ర్‌కా, సికింద‌ర్ సినిమాకి అనుక‌ర‌ణ‌) ఆ ఇమేజ్‌ని బ‌ల‌ప‌రిచింది. త‌ర్వాత కృష్ణంరాజు సినిమాలు ఐదు ఆట‌లు వేశారు. టికెట్ల కోసం బుకింగ్‌లో తోపులాట‌లు స్టార్ట్ అయ్యాయి.

కృష్ణంరాజు ఎంత రెబ‌ల్ స్టార్ అయినా అభిమానులు ఆయ‌న‌లా సాప్ట్‌. అప్ప‌టికే వివిధ హీరోల అభిమాన సంఘాల మ‌ధ్య గొడ‌వ‌లు ఉండేవి. కానీ కృష్ణంరాజు అభిమానులు మాత్రం అంద‌రితో క‌లిసిపోయేవాళ్లు. ఆయ‌న కూడా ఇగోకి వెళ్ల‌కుండా అంద‌రు హీరోల‌తో క‌లిసి న‌టించేవాడు.

ఆయ‌న్ని నేను మొద‌టి సారి చూసింది “నేనంటే నేనే”లో. హీరో ఫిజిక్ అయిన‌ప్ప‌టికీ విల‌న్ షేడ్స్ పాత్ర‌ల‌ని తొలి రోజుల్లో ఎక్కువ‌గా వేశాడు. జీవ‌న త‌రంగాలులో వాణిశ్రీ త‌మ్ముడుగా వేశాడు. ఆయ‌న వేసిన చందు క్యారెక్ట‌ర్ అప్ప‌టికే న‌వ‌ల‌లో చాలా ఫేమ‌స్‌. తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు పోలీసుల నుంచి త‌ప్పించుకోడానికి, త‌న‌కి తెలియ‌కుండానే తండ్రి శ‌వాన్ని మోస్తాడు. చిన్న‌ప్పుడు ఇది చాలా హార్ట్ ట‌చింగ్‌లా అనిపించింది.

క‌న్న‌డ‌లో హిట్ అయిన “శ‌ర‌పంజ‌ర” సినిమాని తెలుగులో కృష్ణ‌వేణిగా తీసాడు. ఆ సినిమాలో వాణిశ్రీ‌నే హీరో. సొంత సినిమాలో పెద్ద‌గా గుర్తింపు లేని (హీరో అయినా) పాత్ర వేయ‌డం ఆయ‌న‌కే సాధ్యం. భ‌క్త‌క‌న్న‌ప్ప‌, మ‌న‌వూరి పాండ‌వులు, అమ‌ర‌దీపంలో ఆయ‌న‌కంటే పాత్ర‌లే ఎక్కువ గుర్తుంటాయి.

1980 వ‌ర‌కూ క‌థ‌కి చాలా ప్రాధాన్యం ఇచ్చే సినిమాల్లోనే న‌టించిన ఆయ‌న , త‌ర్వాత అనేక క‌థాబ‌లం లేని సినిమాల్లో న‌టించాడు. బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బుల్లెట్ దీనికి ప‌రాకాష్ట‌.

తెలుగు సినిమాల్లో ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మైన ముద్ర‌. కొన్ని పాత్ర‌లు ఆయ‌నే చేయ‌గ‌ల‌రు. రాజ‌కీయాల్లో గొప్ప‌ పేరు తెచ్చుకోక‌పోయినా, చెడ్డ పేరు ఎప్పుడూ తెచ్చుకోలేదు. ఒక త‌రం వాళ్లు ఎన్న‌టికీ మ‌రిచిపోలేని నాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడు.

కృష్ణంరాజు సార్ …సెల‌వు. భౌతికంగా మీరు లేరు, తెలుగు సినిమా వున్నంత వ‌ర‌కూ శాశ్వ‌తంగా వుంటారు.

జీఆర్ మ‌హ‌ర్షి