ఆయన జిల్లా కలెక్టర్. కలెక్టర్ బంగ్లాలో హాయిగా ఆయన పానుపు మీద పవళించవచ్చు. కానీ ఆయన సడెన్ గా విశాఖలోని కేజీహెచ్ లో ఒక రోగి బెడ్ మీద కనిపించారు. దాంతో బిత్తరపోవడం స్టాఫ్ వంతు అయింది. కేజీహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కూడా అయిన కలెక్టర్ మల్లికార్జున అక్కడ సమస్యలు పేరుకుపోయాయని, ప్రత్యేకించి రోగుల పట్ల సిబ్బంది పనితీరు మీద విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిసి ఇలా షాక్ ఇచ్చేశారు.
కలెక్టర్ అంతటి వారు కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఎస్సార్ బ్లాక్ మొదటి అంతస్తులోని రోగి పడుకునే బెడ్ మీదనే తాను పడుకున్నారు. దాంతో కేజీహెచ్ స్టాఫ్ కి గుండె దడ మొదలైంది. కలెక్టర్ రాత్రి అంతా అక్కడే ఉండడంతో ఏ విభాగాన్ని సందర్శిస్తారో, ఎవరి భరతం పడతారో అని టాప్ టూ బాటం అప్రమత్తం అయి నిద్ర లేని రాత్రి గడిపారు.
కేజీహెచ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని భావించే కలెక్టర్ ఇలా చేశారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి తన కంటికి కనిపించిన లోపాలను సరిచేసుకోమని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి కలెక్టర్ కనుక ఇలాగే సడెన్ గా కేజీహెచ్ కి వస్తే మాత్రం ఇక తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే అంటున్నారు.
కలెక్టర్ ఇలా పెద్దాసుపత్రిలో రోగుల బెడ్ మీద పడుకుని అక్కడ పరిస్థితుల మీద వాకబు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. శభాష్ కలెక్టర్ గారు ఇలాగే చేయండి. పెద్దాసుపత్రి పెద్ద జబ్బు మటుమాయం అవుతుంది అని అంతా అంటున్నారు.