తెలుగు సినిమా హీరోలు ఒక దశకు వచ్చాకా రాజకీయాల వైపు చూడటం కొత్తేమీ కాదు. తమిళ స్టార్ హీరో ఎంజీఆర్, తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ లు రాజకీయంగా అత్యంత ఉన్నత స్థానాలను చూశారు. వీరి స్ఫూర్తితోనో, వీరికి పోటీగానో చాలా మంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరు.
మిగతా తెలుగు నటులకు భిన్నంగా కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం భారతీయజనతా పార్టీ తో మొదలైనట్టుగా ఉంది. నటుడిగా ఆయన పీక్స్ లో ఉన్నప్పుడు ఏ పార్టీవైపు మొగ్గు చూపారో కానీ, ఆయన ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ తరఫున. వాజ్ పేయ్ మంత్రివర్గంలో కృష్ణంరాజు పని చేశారు.
అయితే 2004లో ఏపీలో తెలుగుదేశం- బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు పార్టీలూ కలిసి పోటీ చేసి మరీ కాంగ్రెస్ హవాలో చిత్తయ్యాయి. అప్పుడు కృష్ణంరాజుకు కూడా ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత కృష్ణంరాజు రాజకీయ కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒక దశలో కాంగ్రెస్ పట్ల కూడా సానుకూలంగా స్పందించే వరకూ వచ్చారు. అయితే 2009లో కొత్తగా వచ్చి ప్రజారాజ్యం పార్టీ లో చేరారు ఈ వెటరన్ యాక్టర్.
ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దాదాపు దూరం అయ్యారు. కానీ 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాకా.. పాత పరిచయాలతోనో ఏమో కానీ ఆయన బీజేపీలో మళ్లీ చేరారు. ఆ దశలో ఆయనకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గవర్నర్ పదవి హామీగా వచ్చిందనే ప్రచారం జరిగింది.
అతిత్వరలో కృష్ణంరాజు గవర్నర్ గా నియమితం కానున్నారని.. రోశయ్య స్థానంలో తమిళనాడుకు చార్జ్ తీసుకుంటారనే టాక్ కూడా నడిచింది. అయితే.. అలాంటిది జరగలేదు. బాహుబలి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ ఇమేజ్ తో కృష్ణంరాజు పేరు మళ్లీ మోగింది. అయితే రాజకీయంగా అవకాశం లభించలేదు. పార్టీ తరఫున కీలకమైన సమయాల్లో పని చేసిన వారికి మోడీ వచ్చాకా మంచి మంచి అవకాశాలు అయితే ఇచ్చారు. ఎందుకో కృష్ణంరాజుకు అలాంటి అవకాశం లభించలేదు!