జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ దిశగా సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్నాటక మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి భేటీ ఆయ్యారు. ఇవాళ ప్రగతి భవన్ లో మూడు గంటల పాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.
తాను పెట్టబోయే జాతీయ పార్టీ విధి విధానాలు గురించి సీఎం కేసీఆర్.. కుమార స్వామితో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడించాలనే లక్ష్యంతో సాగుతున్న సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటు ముందుకు వెళ్తున్నట్లు కనపడుతోంది.
కొన్నిరోజుల క్రితం జాతీయ రాజకీయ పార్టీ దృష్టితో సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనలో బీహార్ సీఎం నితీష్ కూమార్ ను కలిశారు. దానితో పాటు హైదరాబాద్ లో జాతీయ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వరుస భేటీలతో కేసీఆర్ నేషనల్ పార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.
గతంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను ఆయన నివాసంలో కలిసిన తర్వాత ఇప్పుడు మళ్లీ కుమార స్వామి హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రతి వారం ఒక ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు.