ఇంకా రూ.14 వేల కోట్లు రావాలి.. గడువు పెంచిన ఆర్బీఐ

లెక్కప్రకారం ఇవాళ్టితో పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవ్వాలి. కానీ కొన్ని వేల కోట్ల రూపాయల ఖరీదైన పెద్ద నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి, బ్యాంకులకు రాలేదు. అందుకే, ఆర్బీఐ ఇప్పుడు కీలక నిర్ణయం…

లెక్కప్రకారం ఇవాళ్టితో పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవ్వాలి. కానీ కొన్ని వేల కోట్ల రూపాయల ఖరీదైన పెద్ద నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి, బ్యాంకులకు రాలేదు. అందుకే, ఆర్బీఐ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణ గడువును మరో వారం రోజులు పెంచింది. తాజా డెడ్ లైన్ అక్టోబర్ 7.

మే 19న పెద్ద నోటు ఉపసంహరణ ప్రకటన చేసింది ఆర్బీఐ. అప్పటికి మార్కెట్లో చలామణిలో ఉన్న 2వేల రూపాయల నోట్ల ఖరీదు అక్షరాలా 3 లక్షల 56వేల కోట్లు. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 96 శాతం పెద్ద నోట్ల ఉపసంహరణ జరిగినట్టు ఆర్బీఐ ప్రకటించింది.

మిగిలిన 4 శాతం ఓట్ల ఉపసంహరణ కోసం మరో వారం రోజులు గడువు పెంచింది. ఈ 4 శాతం 2వేల నోట్ల ఖరీదు అక్షరాలా 14వేల కోట్ల రూపాయలు. ఈ వారం రోజుల్లో ఈ 14వేల కోట్ల రూపాయల ఖరీదైన 2వేల నోట్లు వెనక్కు వస్తాయా రావా అనేది చర్చనీయాంశమైంది.

ఆర్బీఐ మాత్రం మరోసారి గడువు పెంచబోమని చెబుతోంది. 7వ తేదీ తర్వాత వాణిజ్య విపణిలో 2వేల నోట్ చెల్లదని స్పష్టం చేసింది. ఈలోగా ఎవరి దగ్గరైనా 2వేల నోట్లు ఉంటే నిర్దేశించిన బ్యాంకుల్లో ఎక్స్ ఛేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తోంది.

గడువు తర్వాత దేశంలో బ్యాంకులేవీ 2వేల రూపాయల నోట్లను స్వీకరించవు. అప్పటికీ ఎవరి వద్దయినా 2వేల నోట్లు ఉంటే, దేశవ్యాప్తంగా నిర్దేశించిన 19 ఆర్బీఐ కేంద్రాల్లో మాత్రమే వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలకు పోస్టు ద్వారా కూడా 2వేల రూపాయల నోట్లను పంపించొచ్చు.