ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూఖి హాకర్స్ షాకిచ్చారు. ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఖుష్బూకు ఇలా జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఆ మధ్య ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయిన విషయం తెలిసిందే.
అలాగే బాలీవుడ్ నటి ఈషా దేఓల్ ఇన్‌స్టా ఖాతా హ్యాక్ కావడాన్ని గుర్తించుకోవాలి. దీంతో తన ఫాలోవర్స్ జాగ్రత్తగా ఉండాలని, తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు రిప్లై ఇవ్వొద్దని ఆమె అభిమానులకు సూచించడాన్ని మరిచిపోవద్దు. తాజాగా ఈ హ్యాక్ జాబితాలో నటి, రాజకీయవేత్త ఖుష్బూ కూడా చేరారు.
ఖుష్బూ ట్విట్టర్ పేరుని బ్రియాన్‌గా మార్చేశారు. అంతే కాదు.. ట్విట్టర్‌లో ఆమె ఫొటోను కూడా మార్చేసి ఆశ్చర్యపరిచారు. ఖుష్బూ ట్వీట్స్, పోస్టులన్నీ డిలీట్ కావడం గమనార్హం. తన ట్విట్టర్ హ్యాక్ అయినట్టు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆమె తెలియజేశారు. మూడు రోజుల నుంచి పాస్‌వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తుంటే వీలుకావడం లేదని, ఆ విషయంలో అభిమానులు సాయం చేయాలని కోరడం విశేషం.
ట్విట్టర్ నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాయం అందించకపోగా, తన అకౌంట్‌ను సస్పెండ్ చేస్తామని ట్విట్టర్ హెచ్చరిస్తోందని ఆమె ఆవేదనతో చెప్పుకొచ్చారు. అసలేం జరుగుతుందో తెలియడం లేదని, ఎవరైనా ఈ సమస్యను పరిష్కరిస్తే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతానని ఆమె వెల్లడించారు.