తన శ్రీమతి పుట్టిన రోజును పురస్కరించుకుని మెగా యంగ్ హీరో రామ్‌చరణ్ వినూత్నంగా విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తన అర్ధాంగి ఉపాసన కొణిదెలకు మంగళవారం చెర్రీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.
“నీ కుటుంబం కోసం, నిరుపేదల కోసం ఏదైనా చేయడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. అలాంటి నీకు కృతజ్ఞత చెప్పడానికి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. హ్యాపీ బర్త్‌డే..” అంటూ తన ప్రేమను చాటుకున్నారాయన. ఈ సందర్భంగా హార్ట్, కేక్ ఎమోజీలతో చెర్రీ ట్వీట్ చేశారు. అలాగే భార్య తన భుజంపై వాలి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు.
ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సామాజిక అంశాలపై చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలను చేస్తుంటారు. కరోనా సమయంలో ఆమె ఆ మహమ్మారిపై ఎలా పోరాటం చేయాలో సవివరంగా సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించారు.
అలాగే తన మామ, మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమంలో ఆమె భాగస్వామ్యం వహించి ప్రశంసలు అందుకున్నారు. 2012, జూన్ 14న రామ్‌చరణ్, ఉపాసన ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఆమె అపోలో హెల్త్ కేర్ బాధ్యతలను చూసుకుంటున్నారు. మంగళవారం పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆమెకి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.