వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో దూకుడు ప్రదర్శించారు. దీంతో రాజ్యసభ సమావేశాలు స్తంభించాయి. దీనంతటికి ప్రత్యేక హోదానే కారణం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పట్టుబడుతుండగా, మోదీ సర్కార్ మాత్రం ఇచ్చేందుకు ససేమిరా అని మొండికేసింది. పైగా గత చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా వద్దు…స్పెషల్ ప్యాకేజీ ముద్దు అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షలా తయారైంది.
మరోవైపు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా సాధన కోసం అత్యున్నత చట్టసభల వేదికగా వైసీపీ పోరాడుతోంది. ఇందులో భాగమే తాజాగా జరుగుతున్న ఉభయ చట్ట సభల్లో వైసీపీ గట్టి పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలని కోరుతూ రెండోరోజు మంగళవారం వైసీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.
ఈ నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. చైర్మన్ స్పందిస్తూ రూల్ 267 కింద 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారన్నారు. అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని తేల్చి చెప్పారు. దీంతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమే అన్నారు. దీనిపై చర్చకు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు.
చైర్మన్ జవాబిస్తూ…. దీనిపై వాదన వద్దని సూచించారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధించిన వ్యవహారమని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాజ్యసభ చైర్మన్ సమాధానంతో విజయసాయిరెడ్డి సంతృప్తి చెందలేదు. చర్చకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విజయసాయి ప్లకార్డు పట్టుకుని నిరసకు దిగారు.
పోడియం వద్ద నిలబడి ఆందోళన చేనట్టారు. ఆయనకు వైసీపీ ఇతర సభ్యులు తోడయ్యారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభ స్తంభించింది. ఈ నేపథ్యంలో సభను గంటపాటు చైర్మన్ వాయిదా వేశారు.