ఈ కాలం సినిమా ప్రచారం ఎలా సాగుతోందంటే, ఏమాత్రం కలిసొస్తుందంటే చాలు, ఏ అంశాన్నైనా ప్రమోషన్ కోసం వాడేస్తుంటారు సినీ జనాలు. ఆమధ్య ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయన మరణాన్ని కూడా సినిమా ప్రచారం కోసం వాడేస్తారని కలలో కూడా ఎవ్వరూ ఊహించలేదు. కానీ అదే జరిగింది. ఇప్పటికీ ఇంకా అది కొనసాగుతూనే ఉంది.
సిరివెన్నెల కన్నుమూసిన టైమ్ లో ఆయన రాసిన చివరి పాట ఇదేనంటూ ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ పాటకు తెగ ప్రచారం జరిగింది. అయితే అదే చివరి పాట అనే విషయాన్ని ఆర్ఆర్ఆర్ యూనిట్ క్లెయిమ్ చేసుకోలేదు. ఆ పనిని శ్యామ్ సింగరాయ్ యూనిట్ చేసింది.
నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో పాటే సిరివెన్నెల రాసిన చివరి పాట అంటూ హీరోతో పాటు యూనిట్ అంతా ప్రకటించుకుంది. ఆయనకు ఘన నివాళి ఇదేనంటూ, ఆయన రాసిన చివరి పాట అదేనంటూ.. లిరికల్ వీడియో రిలీజ్ చేసి తెగ హడావుడి చేసింది.
కట్ చేస్తే, పక్కా కమర్షియల్ అనే సినిమా కోసం కూడా ఇదే ప్రచారాన్ని వాడుకున్నారు. 'జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు' అంటూ ఆయన తమ సినిమాలో అందమైన పాట రాశారని.. సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదేనంటూ మారుతి, గీతాఆర్ట్స్-2 జనాలు చెప్పుకొచ్చారు.
సిరివెన్నెల రాసిన చివరి గీతం శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఉందా.. పక్కా కమర్షియల్ మూవీలో ఉందా అనే అనుమానాల మధ్యలోనే కొత్తగా కార్తికేయ కూడా ఈ ప్రచారంలోకి చేరాడు. రీసెంట్ గా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు కార్తికేయ. నేహా శెట్టి హీరోయిన్ గా సెట్స్ పైకి కూడా వచ్చిన ఈ సినిమా కోసం సిరివెన్నెల రాసిన పాటే, ఆయన చిట్టచివరి గీతం అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పాటకు గుర్తింపు తెచ్చిన అతికొద్ది మంది వ్యక్తుల్లో సిరివెన్నెల ఒకరు. అలతి అలతి పదాలతో తెలుగు తెరకు అందమైన అక్షర కాంతులు అద్దిన ఈ దిగ్గజ గేయ రచయితను స్మరించుకోవడంలో తప్పులేదు. స్మరించుకోవాలి కూడా. కానీ ఇలా ప్రచారానికి వాడుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు.
తమ సినిమాలో స్వర్గీయ సిరివెన్నెల ఓ అందమైన పాట రాశారని చెప్పుకోవడం ఏ యూనిట్ కైనా గర్వకారణం. అక్కడితో ఆగితే అందరికీ మంచిది. సిరివెన్నెల రాసిన చివరి పాట తమ సినిమాలోనిదే అని చెప్పుకోవడం మాత్రం కచ్చితంగా ప్రచారమే అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సిరివెన్నెల చివరిపాట ఏంటనే చర్చను వదిలేద్దాం, ఆయన పాటల పూదోటలో విహరిద్దాం. ఆయన్ను మరోసారి స్మరించుకుందాం. అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.