ఇది పవర్ ఫుల్ డైలాగ్. అంతే కాదు వాలీడ్ పాయింట్ కూడా. ఈ రోజు ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే జాగ్రత్తగా వెతుక్కోవాల్సిందే. అలాంటి కాంగ్రెస్ కి ఊపిరి పోసే పనిని వైసీపీ ఎందుకు చేస్తుంది. ఇదే మాటను యువ మంత్రి గుడివాడ అమరనాధ్ చాలా చక్కగా చెప్పారు.
అసలు కాంగ్రెస్ ని భూస్థాపితం చేసేందుకే పుట్టిన పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు దేశంలో కాంగ్రెస్ ని సోనియాను ఎదిరించిన ఏకైక మొనగాడుగా జగన్ చరిత్రలో ఎక్కారని కూడా పేర్కొన్నారు.
135 ఏళ్ల చరిత్ర కలిగిన శతాధిక వృద్ధ పార్టీ కాంగ్రెస్ ఈ రోజు సీట్ల కోసం వెతుక్కునే పనిలో ఉంది అంటే అది వైసీపీ జగన్ గొప్పతనం తప్ప మరేమీ కాదని ఆయన అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ వైసీపీకి వ్యూహకర్త మాత్రమే. ఆయన సలహాలు ఇస్తారు. వాటిని పాటించాలా వద్దా అన్నది అధినాయకత్వం చూస్తుంది అని గుడివాడ క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికి కాంగ్రెస్ తో ఏ కోశానా పొత్తు మాట కాదు కదా ఆ ఊసే ఉండదని మంత్రి గారు గట్టిగానే చెప్పేశారు. ఒక విధంగా కొద్ది రోజులుగా నలుగుతున్న ఈ అంశం మీద ఇంత పకడ్బంధీగా విషయాన్ని చెప్పిన యువమంత్రి హ్యాండ్ పార్టీకి బ్యాండ్ బాజాయే ఏపీలో అనేశారన్న మాట.