నన్ను మించిన గొప్పవాడు లేనే లేడు.. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు.. అనుకునే తరహా అమాయకత్వం ఏ కొంచెమైనా లేకపోతే రాజకీయాల్లో మనగలగడం చాలా కష్టం. అలాంటి అమాయకత్వమూ, ఫాల్స్ కాన్ఫిడెన్సూ పుష్కలంగా ఉన్న నాయకుల్లో పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటారు.
ప్రభుత్వం తన వంతు పనిలో భాగంగా.. రోడ్డు రిపేర్ల పనులు చేపడుతూ ఉంటే.. తన టూర్ చూసి జడుసుకుంటున్నారని పవన్ కల్యాణ్ మురిసిపోతున్నారు. తన టూర్ ను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎత్తుగడ వేసినదంటూ.. అర్థంలేని అడ్డగోలు ప్రచారం చేసి.. రాజకీయంగా అనుచిత లబ్ధి పొందడానికి ఆయన నిస్సిగ్గుగా సాహసిస్తున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పవన్ కల్యాణ్ లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇదొక యాత్రలాగా.. ఆయన ఊరూరా తిరుగుతున్నారు. గతంలో ఇలాంటి లక్ష రూపాయల సహాయం చెక్కులను పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ వెళ్లి ఇచ్చి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు షూటింగ్ గ్యాప్ ఉన్నందునన పవన్ కల్యాణ్ తానే వెళ్లి స్వయంగా ఇచ్చి ఫోటోలు దిగి వస్తున్నారు. ఇలాంటి యాత్ర అనంతపురంలో జరిగింది. ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో జరగబోతోంది.
ఈ మేరకు ఆయన ఆ జిల్లాలోని చింతలపూడి గ్రామానికి వెళ్లనున్నారు. పవన్ రాబోతున్న సంగతి తెలిసి ప్రభుత్వం జడుసుకుంటున్నదిట! ఆయన యాత్రకు ఆటంకాలు సృష్టించదలచుకున్నదిట. అని పవన్ కల్యాణ్ ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్.. పార్టీ శ్రేణులు గోల చేస్తున్నారు.
ఇంతకూ ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలుసా?
ఆయన కారు వెళ్లబోయే మార్గంలో ప్రస్తుతం రోడ్డు రిపేరు పనులు ప్రారంభించారు. పవన్ యాత్రకు ఆటంకం కలిగించడానికే ఇప్పుడు రిపేర్లు చేస్తున్నారనేది వీరి ఆరోపణ. ప్రభుత్వం ప్రాసెస్ లో భాగంగా రోడ్ల రిపేర్లు చేపడితే.. అదేదో తనకు జడుసుకుని చేస్తున్న పనుల్లాగా పవన్ కల్యాణ్ బిల్డప్ ఇచ్చుకోవడం లేకిగా ఉంది.
రోడ్డు రిపేర్లు చేయలేదని ఇదే పార్టీ తరఫున పవన్ కల్యాణ్ నానాయాగీ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం గ్రామీణ రోడ్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం మొదలుపెట్టగానే.. ఆయన వందిమాగధులు వచ్చి వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ యాత్రకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చింతలపూడి నియోజకవర్గం ధర్మాజి గూడెం వద్ద రోడ్డు పనులను ప్రారంభిస్తే.. వీళ్లు దానిపై ఇలా ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆ మార్గంలో ముందుగానే వెళ్లిన నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని, అధికార్లను బెదిరించడం పొలిటికల్ మైలేజీకోసం డైలాగులు వేయడం చీప్ గా ఉందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.