ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం. పుస్తకం వుంటే కాపీ వుంటుంది. కాపీ కొట్టే హక్కునే కాపీరైట్ అంటారు. ఒకప్పుడు గుట్టుగా కాపీ కొట్టేవాళ్లు. ఇప్పుడు అంత ఓపిక లేదు, వేగంగా కొట్టేస్తారు. చట్టం వున్నా కోర్టుకెళ్లి ఆధారాలతో సహా నిరూపించడం కష్టం. అదీ మన ధైర్యం. ఈ మధ్య థియేటర్ల మీద ఒక వ్యాసం రాస్తే, అది గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్‌లో వచ్చిన కొన్ని గంటల్లోనే కట్ పేస్ట్ చేసి వాట్సప్ గ్రూప్‌ల్లో టూర్ చేయించారు.
నా పేరు గానీ, గ్రేట్ ఆంధ్ర సౌజన్యం అని గానీ లేకుండా నాక్కూడా పంపారు. కొంత మంది తమ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి “కళ్లు చెమర్చాయి, బాల్యంలోకి వెళ్లిపోయాం” అని కామెంట్స్ పెట్టిన వాళ్లకి లైక్‌లు కూడా కొట్టారు. ఇది రాసింది వేరే ఎవరో అని చెప్పను కూడా చెప్పలేదు. డిజిటల్ యుగంలో దొరికిపోతామని తెలిసి కూడా కాపీ కొడుతూ వుంటే, గతంలో ఎన్ని జరిగి వుంటాయి. తమ రచనలు కాపీ చేశారని కనీసం ఆ రచయితలకి తెలిసే ఛాన్స్ కూడా లేదు.
సినిమాల్లో, సాహిత్యంలో కాపీ అనేది ఒక హక్కు. అలెగ్జాండర్ డ్యూమా “కౌంట్ ఆఫ్ ది మాంట్ క్రిస్టో” నవల రాసాడు. తెలుగు అనువాదం మాత్రమే కాదు, తెలుగు పాత్రలతో నవల కూడా ఉంది. 40 ఏళ్ల క్రితం సీరియల్‌గా కూడా వచ్చింది. చిరంజీవితో “వేట” సినిమా కూడా తీశారు. కథ సంయుక్తా మూవీస్ అందించింది. పాపం డ్యూమా!
సోమర్‌సెట్‌మామ్ కథని ఒక రచయిత్రి నవలగా రాస్తే, హక్కులు కొని నాగేశ్వరావుతో సినిమా కూడా తీశారు. ఒక ప్రముఖ రచయిత్రి నవలలు తమిళ, కన్నడ భాషల్లో ఇంకెవరి పేరుతోనో అచ్చయిపోతే , ఆ విషయం తెలియడానికి ఏళ్లు పట్టింది.
ఒక ప్రముఖ దర్శకుడు పాత సినిమానే కొత్త నటులతో తీస్తే జనం గగ్గోలు పెడితే ఆ రచయిత్రికి సారీ చెప్పాడు. ఇతర భాషల సినిమాలను యధాతధంగా దించిన వాళ్లు ఎందరో. ఫిల్మ్‌నగర్‌లో కొందరు డైరెక్టర్లు కొరియా నేర్చుకుని మరీ కొరియా సినిమా కథల్ని తయారు చేస్తున్నారు.
జేమ్స్ హాడ్లీ, హెరాల్డ్‌రాబిన్స్, షిడ్నీ షెల్డన్‌లు తెలుగులో ఎందరో. ఒకప్పుడు వీక్లీ సీరియల్స్ అన్నీ ఇవే. ఇతర భాషల కథల్ని సొంతంగా చెలామణి చేసి, ఆ కథని ఎంత కష్టపడి రాసారో సవివరంగా చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు.
కాపీలో కూడా కొంచెం కష్టం వుంటుంది. తెలుగుకి అనుగుణంగా సన్నివేశాలు మలుచుకోవాలి. కొంచెం టాలెంట్ అవసరం. విపులలో నేను అనువాదం చేసిన ఒక కథని మరీ నికృష్టంగా ఒక రచయిత కాపీ చేసి ఆంధ్రజ్యోతి వీక్లీలో అచ్చేసుకున్నాడు.
కథ పేరు, పాత్రల పేర్లు మార్చి యధాతధంగా అచ్చేసుకున్నాడు. కనీసం తిరగరాసే ఓపిక కూడా లేదు.
మనం ఎంతో ఇష్టంగా పాడుకునే వివాహ భోజనంబు కూడా కాపీనే. షోలేలో సీన్స్ మాత్రమే కాదు, మెహబూబా పాట కూడా కొట్టేసిందే. మగాళ్లు వట్టి మాయగాళ్లు పాట (గోలీమార్ సినిమా) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇటాలియన్ పాప్ సాంగ్. టోటో కుటుగ్నో పాడాడు. యూట్యూబ్‌లో వినండి అద్భుతం.
గాడ్‌ఫాదర్ సినిమానే కాదు, సంగీతాన్ని ఎంత మంది లేపారో లెక్కలేదు. చిట్టిచెల్లెలులో ఈ రేయి తీయనిది పాట కావాలంటే వికి అని కొట్టండి. వేరే భాషలో వస్తుంది.
అందరి కంటే దారుణమైన సంగీత కాపీకి గురైంది. ఇటాలియన్ కంపోజర్ ఎన్నియో మొర్రికోన్ 92 ఏళ్ల వయసులో ఈ మధ్య చనిపోయాడు. గుడ్ బాడ్ అండ్ అగ్లీ మ్యూజిక్ వినకుండా ఒక రోజు కూడా నిద్రపోలేని పరిస్థితి తెచ్చిన మహానుభావుడు. సూపర్‌హిట్ కౌబాయ్ సినిమాలన్నీ ఈయన చేతి మీదుగా వచ్చినవే. 1970 తర్వాత వచ్చిన కృష్ణ క్రైమ్ సినిమాల్లో మన సత్యం బాబాయ్ వాడిన సంగీతమంతా ఎన్నియో చలవే.
ఈ మధ్య వచ్చిన సూపర్‌హిట్ సినిమాలో హీరో శివలింగం మోసే సీన్ శాంసన్ అండ్ దిలైలాలో వుంటుంది. కాకపోతే అక్కడ రాగి కూజా. చెబుతూ పోతే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది.
తేనెటీగ కూడా పువ్వుల నుంచే మకరందం సేకరిస్తుంది. కానీ తేనె రుచి ఈగ సృష్టి. అలాగే ప్రేరణ తప్పు కాదు, అది లేకుండా ఏ కళా పుట్టదు. కానీ ఇతరుల కష్టాన్ని, సృజనని తమ పేరుతో చెలామణి చేసుకోవడం ఆత్మ ద్రోహం. మనకి ప్రేతాత్మలే తప్ప ఆత్మలు ఎక్కడున్నాయ్?
కొత్త దర్శకులు మరీ ఘోరం. కథలు ఎలాగూ కొట్టేస్తారు. అక్షరం ముక్క రాయకుండా మాటలు తామే రాసినట్టు పేరు వేసుకుంటారు. రాసిన వాడి పేరు రచనా సహకారం అని రెండు సెకండ్లు కనిపిస్తుంది.
మంచి కాఫీలాంటి సినిమా ఆనంద్ ఒకటే. మంచి కాపీ లాంటి సినిమాలు కొన్ని వందలు.
జీఆర్ మహర్షి