మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై నోరుజారడమే కాకుండా, మళ్లీ దబాయింపులకు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తెగబడ్డారు. బొండా ఉమా నుంచి సంస్కారవంతమైన మాటలను కోరుకోవడం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సాటి ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలో ఆంటీ అని సంబోధించి అవహేళన చేయడం తెలిసిందే. ఆడవాళ్ల విషయంలో బొండా ఉమా నోటికొచ్చినట్టు మాట్లాడ్డంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలి పరామర్శలో తీవ్ర ఉద్రిక్తత నెలకున్న సంగతి తెలిసిందే. వాసిరెడ్డి పద్మను నోర్మూయ్ అని అనుచితంగా మాట్లాడ్డంతో, విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకొచ్చారు. మరోసారి అవాకులు చెవాకులు పేలారు.
కూర్చున్న కుర్చీ విలువ ఏంటో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. పదవి ఇచ్చినందుకు తాడేపల్లి ఆదేశాలు పాటిస్తారా? అని నిలదీశారు. మహిళల రక్షణ వదిలేసి తాడేపల్లి విధేయత చాటుకోవడమే పనా అని ప్రశ్నించారు. చంద్రబాబు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. ఇదిలా వుండగా బొండా ఉమా నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న చందంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళలపై అత్యాచారాలను ఏ ప్రభుత్వమైనా సమర్థిస్తుందా? రాజకీయ ప్రయోజనాల కోసం బొండా ఉమా అరిచినంత మాత్రాన, ఆయన గురించి తెలిసిన వాళ్లెవరూ నమ్మే పరిస్థితి లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై నోరు జారినందుకు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం బొండా పురుష అహంకారానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ మాటల్లో చెప్పాలంటే ఆకురౌడీలు మీడియా ముందుకొచ్చి నీతులు మాట్లాడ్డం విచిత్రం. ఇప్పటికే బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. అలాగే ఇంటి స్థలం, ఉద్యోగం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. నిందితులకు కఠిన శిక్ష విధించేందుకు సత్వర చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం వేగంగా స్పందించడమే టీడీపీ నేతల దృష్టిలో నేరమైనట్టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో టీడీపీ బొండా ఉమాను ముందుకు తేవడం వ్యూహాత్మక తప్పిదమనే చర్చ జరుగుతోంది. మరెవరైనా మాట్లాడి వుంటే కొంచెం గౌరవంగా ఉండేదని టీడీపీ వర్గాలే చెబుతుండడం విశేషం.