ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గ్రామ సచివాలయ వ్యవస్థ, మరో రాష్ట్రంలో కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను నెలకొల్పారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించారు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా 576 రకాల సేవలను అందిస్తున్నారు.
దీంతో ప్రతి చిన్న విషయానికి మండల, జిల్లా కార్యాలయాలకు వెళ్లాల్సిన పని తప్పింది. ప్రభుత్వ సేవలు ఇంటి ముంగిటకే వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు అందించిన సేవలు చిరస్మరణీయం. కరోనాను ఏపీ దీటుగా ఎదుర్కోడానికి సచివాలయ వ్యవస్థ ఎంతో ఉపయోగపడింది. ఇవాళ సచివాలయ వ్యవస్థ లేని గ్రామాన్ని ఊహించడం కష్టం.
ఈ నేపథ్యంలో మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో గ్రామ సచివాలయ వ్యవస్థను నెలకొల్పాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని తమిళనాడు అసెంబ్లీ వేదికగా స్టాలిన్ ప్రకటించడం విశేషం. ఈ వార్త ఏపీ సమాజాన్ని ఆకర్షిస్తోంది. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఆధునిక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో తప్పక నిలిచిపోతారు. జగన్ పాలనపై ఎన్నో విమర్శలున్నాయి. కానీ సచివాలయ వ్యవస్థను తప్పు పట్టేవాళ్లు లేరు. రాబోవు తరాలు జగన్ పాలనలోని గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే తప్పక గ్రామ సచివాలయ వ్యవస్థనే గుర్తు చేసుకుంటారు.
తమిళనాడులో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు స్టాలిన్ వెల్లడించారు. ఇది మంచి పరిణామంగా చెప్పొచ్చు. మంచి పనులు ఎవరు చేసినా… స్వీకరించడంలో తప్పు లేదు. ఏపీలో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నసచివాలయ వ్యవస్థ గురించి తమిళనాడు ప్రభుత్వం అధ్యయనం చేసినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో తమిళనాడులో జగన్ పాలన గుర్తు తెచ్చేలా సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించడం ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ విషయం. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలయ్యే మంచి పాలనారీతులను జగన్ కూడా పాజిటివ్‌గా తీసుకోవాల్సిన ఆవశ్యకతను స్టాలిన్ నిర్ణయం తెలియజేస్తోంది.