నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాను ఫీల్ అయ్యే విషయాలను సమాజంతో పంచు కోవడంలో ఆమె ధైర్య సాహసాలు ఎక్కువ సార్లు ప్రశంసలు అందుకున్నవే. తాజాగా ఆమె మరో డిమాండ్‌తో సోషల్ మీడియా వేదికపైకి వచ్చారు. ఆమె డిమాండ్ టాలీవుడ్‌ను ఇరికించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సర్కార్‌ను ఆమె చేస్తున్న సంచలన డిమాండ్ ఏంటో తెలుసుకుందాం.
‘టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతారు. దీనిపై తెలంగా ఎన్‌సీబీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి’ అని తన ఫేస్‌బుక్ ద్వారా మాధవీలత డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నాలుగు రోజుల క్రితం బాలీవుడ్‌లో డ్రగ్స్ విషయమై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఆ డిమాండ్‌కు కొనసాగింపుగా అన్నట్టు టాలీవుడ్‌లో మాధవీలత తెరపైకి రావడం విశేషం. టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకంపై గతంలో తెలంగాణ సర్కార్ ఎంతో హడావుడి చేసిన విషయం తెలిసిందే. పలువురు ప్రముఖ దర్శకులు, నటీనటులను సిట్ దర్యాప్తు చేసింది. ఈ వ్యవహారంలో పెద్దపెద్ద తలకాయలు ఇరుక్కుంటాయని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. అయితే చివరికి ఏమీ లేకుండానే కేసు మూలన పడింది. మళ్లీ డ్రగ్స్ దందాపై విచారణ జరపాలని మాధవీలత డిమాండ్ చేయడం…తేనెతుట్టెను కదపడమే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అనవసరంగా ప్రభుత్వానికి ఒక ఆలోచన కల్పించి…చేజేతులా టాలీవుడ్ జుట్టును ప్రభుత్వం చేతిలో పెట్టించాలనే కోరికతో మాధవీలత డిమాండ్ ఉన్నట్టు టాలీవుడ్‌కు చెందిన కొందరు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయినా ప్రభుత్వానికి ఎక్కడేం జరుగుతున్నదో తెలియదా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నవాళ్లను భయపెట్టేలా మాధవీలత డిమాండ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.