సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్, అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టినట్టయింది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో సినిమా వచ్చింది. వీళ్లిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా కాబట్టి లెక్క సరిపోయింది. మరి మహేష్ ఎలా హ్యాట్రిక్ కొట్టినట్టయింది? దిల్ రాజు కాంబినేషన్ లో మహేష్ హ్యాట్రిక్ కొట్టాడు.
మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా నిర్మించాడు దిల్ రాజు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ పడినట్టయింది.
ఇక బన్నీ-త్రివిక్రమ్ గురించి అందరికీ తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల వైకుంఠపురములో సినిమాతో వీళ్లు మరో సక్సెస్ కొట్టారు. ఇప్పుడీ ఇద్దరు హీరోలు ఒకేసారి డబుల్ హ్యాట్రిక్ పై ప్రకటనలు చేసి ఆసక్తి రేకెత్తించారు.
అల వైకుంఠపురములో థ్యాంక్స్ మీట్ లో మాట్లాడిన బన్నీ.. త్రివిక్రమ్ తో ప్రస్తుతానికి హ్యాట్రిక్ కొట్టానని.. డబుల్ హ్యాట్రిక్ దిశగా మరిన్ని సినిమాలు చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం ఇది కామా మాత్రమేనని, మరిన్ని హిట్స్ వస్తాయన్నాడు. అటు సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ లో మహేష్ బాబు కూడా ఇలానే రియాక్ట్ అయ్యాడు. దిల్ రాజు ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మరిన్ని సినిమాలు కలిసి చేయాలని వరుసగా హిట్స్ ఇవ్వాలని అన్నాడు మహేష్ బాబు. అలా ఈ సంక్రాంతి హీరోలిద్దరూ తమకు కలిసొచ్చిన దర్శకుడు, నిర్మాతతో డబుల్ హ్యాట్రిక్ కొడతామంటున్నారు.