సర్వసంగ పరిత్యాగుల్లో గ్రూపు రాజకీయాలు

స్వామీజీలు అంటే చాలామంది సన్యాసులు. అంటే సర్వసంగ పరిత్యాగులు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. వారికి కామ క్రోధాలు, ద్వేషాసూయలు ఉండకూడదు. మద మాత్సర్యాలు వారి దరిజేరకూడదు. కానీ.. ఇవాళ స్వామీజీలుగా ప్రచారంలో…

స్వామీజీలు అంటే చాలామంది సన్యాసులు. అంటే సర్వసంగ పరిత్యాగులు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. వారికి కామ క్రోధాలు, ద్వేషాసూయలు ఉండకూడదు. మద మాత్సర్యాలు వారి దరిజేరకూడదు. కానీ.. ఇవాళ స్వామీజీలుగా ప్రచారంలో ఉన్నవారు ఉద్యమాలలో భాగం పంచుకుంటున్నారు. స్వామీజీలు ఉద్యమాల్లో ఉండడమూ, లీడ్ చేయడమూ, పోరాడడమూ కొత్త సంగతి కాదు. అది వారు ధర్మంగా భావించవచ్చు కూడా..  కానీ ద్వేషాసూయల్ని కూడా చాటుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ స్థానికులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో నిజానికి స్వామీజీలకు సంబంధం లేదు. కానీ.. కొన్ని పీఠాలకు చెందిన వారు వచ్చి.. ఈ స్థానికుల దీక్షలకు మద్దతిచ్చారు. అమరావతినుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని తాము నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ దీక్షలకు త్వరలోనే ఆరెస్సెస్, వీహెచ్పీ మద్దతిస్తాయని కూడా అన్నారు. ఈ విషయంలో తమకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారని అన్నారు.

స్వామీజీలకు రాజకీయాలు ఎంతమేరకు తెలుసో గానీ.. వారి మాటలు, బెదిరింపులు మాత్రం బలే కామెడీగా ఉన్నాయి. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అమరావతి నుంచి రాజధాని తరలింపును తీవ్రంగానే వ్యతిరేకిస్తూ వస్తోంది. కేంద్రంలోని నాయకులు మాత్రం తమకు సంబంధం లేదని అంటున్నారు. భాజపా స్వయంగా వ్యతిరేకిస్తుంటేనే దిక్కులేదు.. ఇక ఆరెస్సెస్, వీహెచ్పీ రంగంలోకి దిగితే ఏదో అయిపోతుందని అనుకుంటున్నారంటే.. అలాంటి బెదిరింపులకు జగన్ వణికిపోతాడని అనుకుంటున్నారంటే.. సదరు స్వామీజీలను పాపం అమాయకులను భావించాల్సిందే. ప్రధాని అపాయింట్మెంట్ కూడా ఏదో ఉత్తుత్తి డ్రామాలాగానే ఉంది. అదే దొరికితే అక్కడే చక్రం తిప్పి, తరలింపు ఆపించకుండా.. ఈ డ్రామాలెందుకు?

రెండో విషయం ఏంటంటే… ఈ దీక్షలకు మద్దతివ్వకపోతే గనుక.. స్వరూపానందేంద్ర స్వామిని వీరంతా కలిసి బహిష్కరిస్తారట. అసలు రాజధాని తరలింపునకు ఆయనకేంటి సంబంధం. ఆయన మాటకోసం జగన్ రాజధాని తరలిస్తున్నాడని ఎవడో తలలేనోడు ఒక ప్రచారం పుట్టిస్తే.. దాన్ని ఈ స్వాములందరూ ఎలా నమ్ముతున్నారు? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.