చాయ్ బిస్కెట్ కు పడిపోయిన మహేష్ బాబు?

స్టార్ హీరోలు వేసే ట్వీట్స్ కు ఓ ప్రామాణికత ఉంటుంది. వాళ్లు చెప్పే మాటలకు ఫ్యాన్స్ లో తిరుగులేని విశ్వసనీయత ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్టార్స్ పై ఉంది. అందుకే తమ…

స్టార్ హీరోలు వేసే ట్వీట్స్ కు ఓ ప్రామాణికత ఉంటుంది. వాళ్లు చెప్పే మాటలకు ఫ్యాన్స్ లో తిరుగులేని విశ్వసనీయత ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్టార్స్ పై ఉంది. అందుకే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను చాలా జాగ్రత్తగా వాడుతుంటారు స్టార్ హీరోలు. ఈ విషయంలో వాళ్లు తమ పీఆర్ టీమ్ లేదా ఏజెన్సీలను బలంగా నమ్ముతారు. ప్రతి ట్వీట్ ను తాము సొంతంగా టైపు చేసి పోస్ట్ చేయరనే విషయం చాలామందికి తెలిసిందే.

అయితే ఇలాంటి ఏజెన్సీలు/పీఆర్ ను కూడా గుడ్డిగా నమ్మితే ప్రమాదమే. అలా నమ్మి, విమర్శల పాలవుతున్నాడు మహేష్ బాబు. ఇన్నాళ్లూ ఈ హీరో ట్విట్టర్ హ్యాండిల్ కు ఓ విశ్వసనీయత ఉండేది. ఎప్పుడైతే 'మేమ్ ఫేమస్' సినిమాను తోపు అంటూ ట్వీట్ వేశాడో, దానికి రివర్స్ లో సినిమా ఉందని ప్రేక్షకులు గ్రహించారో, ఆ క్షణమే మహేష్ ట్వీట్ల విశ్వసనీయత కోల్పోయింది.

తన టీమ్ కు చెందిన సినిమా కాబట్టి మహేష్ దానికి ప్రచారం చేయడంలో తప్పు లేదు. ఆడియన్స్ కూడా దాన్ని ప్రచారం కిందనే చూస్తారు. కానీ మేమ్ ఫేమస్ సినిమాకు మహేష్ ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా తను చూశానని అద్భుతమని చెప్పుకొచ్చాడు మహేష్, అక్కడితో ఆగకుండా తన సొంత బ్యానర్ పై మేమ్ ఫేమ్ దర్శకుడు కమ్ హీరో తో సినిమా చేస్తాననే అర్థం వచ్చేలా ట్వీటాడు.

దీంతో మహేష్ టేస్ట్ ఏంటి ఇంత చీప్ గా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. సినిమాకు తక్కువ, యూబ్యూట్ వీడియోకు కాస్త ఎక్కువగా ఉన్న ఈ సినిమా మహేష్ కు ఎలా నచ్చిందో అర్థంకావడం లేదంటున్నారు చాలామంది. సినిమా చూసి బయటకొచ్చిన మహేష్ ఫ్యాన్స్.. సినిమాలో ఏ పార్ట్ నచ్చిందో చెప్పమంటూ పోస్టులు పెట్టి, మహేష్ ను ట్యాగ్ చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాను మహేష్ చూసి ఉండడు, చూస్తే ఆ ట్వీట్ వేయొద్దని కచ్చితంగా తన టీమ్ కు చెప్పేవాడు. కేవలం తన టీమ్ ను గుడ్డిగా నమ్మి, ట్వీట్ వేయడానికి అనుమతి ఇవ్వడం వల్ల జరిగిన అనర్థం ఇది. ఇటు మహేష్ ఇమేజ్ డ్యామేజ్ అయినా, అటు చాయ్ బిస్కెట్ కు మాత్రం మేమ్ ఫేమస్ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఈ సినిమాకు మొదటిరోజు (ప్రీమియర్స్ తో కలిపి) కోటికి పైగా గ్రాస్ వచ్చింది. వాళ్లు హ్యాపీ. మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఉసూరుమంటున్నారు. ఇకనైనా మహేష్ బాబు ఇలాంటి 'చాయ్ బిస్కెట్ల'కు పడకుండా ఉంటే మంచిది.