మే 31 కోసం మహేష్ అభిమానులు ప్రతి ఏటా ఎదురుచూస్తుంటారు. ఆరోజు కృష్ణ పుట్టినరోజు మాత్రమే కాదు, ఆ బర్త్ డేకి మహేష్ మూవీస్ నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. అదే ఉద్దేశంతో నిన్నంతా ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ మహేష్ మాత్రం సెంటిమెంట్ తప్పాడు. ఈసారి తండ్రి పుట్టినరోజుకు ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వలేదు.
త్వరలోనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇక బ్యాలెన్స్ ఏమైనా ఉందంటే అది రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే డేట్ మాత్రమే.
ఆ తేదీని నిన్న ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. కానీ ఇటు మహేష్ నుంచి, అటు హారిక-హాసిని బ్యానర్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కేవలం కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి చేతులుదులుపుకున్నారంతే.
ఇక రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ మూవీ తర్వాత స్టార్ట్ అయ్యేది ఇదే. ఈ కాంబినేషన్ పై ఇప్పట్నుంచి ప్రకటన ఆశించడం అత్యాశే అవుతుందని ఫ్యాన్స్ కు తెలుసు. కానీ మహేష్-రాజమౌళి ఫొటోలతో ఫార్మల్ గా చిన్న పోస్టర్ అయినా వదులుతారేమోనని కొంతమంది ఎదురుచూశారు. అది కూడా జరగలేదు.
ఈ రెండు ప్రాజెక్టులు పక్కనపెడితే, మహేష్ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. 14 రీల్స్ బ్యానర్ పై ఆ ప్రకటన వస్తుందంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ అది కూడా జరగలేదు.
మొత్తమ్మీద ఈ ఏడాది కృష్ణ బర్త్ డేకి మహేష్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అలా మహేష్ తన సెంటిమెంట్ ను ఈ ఏడాది మిస్ చేశాడు.